ఖమ్మం, మార్చి05, బిసిఎం10 న్యూస్.
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)లో మహాకుంభమేళా, ఫిబ్రవరి 28న జాతీయ సైన్సు దినోత్సవం జరిగింది. మీడియా దేనికి ఎంత ప్రచారమిచ్చింది.?? కుంభమేళాకు ఇచ్చిన ప్రచారంలో వెయ్యో వంతైనా శాస్త్ర విజ్ఞానం, మూఢవిశ్వాసాలు సంబంధిత లాభనష్టాల గురించి పాఠకులు, వీక్షకులకు చెప్పిందా..?? కుంభమేళా స్నానాలకు - ప్రవచనాలకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం 66 కోట్ల మంది గంగ, యమున, అంతర్వాహిని అని చెబుతున్న సరస్వతి నది త్రివేణీ సంగమంలో మునకలేసి స్నానాలు చేశారు.
● అమెరికా చాట్ జిపిటి, చైనా డీప్ సీక్‌లో మునిగి తేలుతుంటే మనం గంగలో మునకలేస్తున్నాం.
మన వారు డీప్ సీక్ రూపొందించలేక పోవటానికి మన దేశాన్ని విదేశీ పాలకులు ఆక్రమించుకోవటమేనంటూ ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్‌లో మత కోణాన్ని జోడించి విశ్లేషణ చేశారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయని లొట్టలు వేసుకుంటూ చెబుతారు. గత పది సంవత్సరాలుగా పురాణాల్లో చెప్పిన పుక్కిటి కబుర్లను వల్లె వేస్తున్నారు. మన దేశంలో ఎప్పుడో అవయవ మార్పిడి జరిగిందనటానికి వినాయకుడికి ఏనుగు తొండం అమర్చటమని, కృత్రిమ గర్భం ద్వారా జన్మించిన పిల్లలకు ఉదాహరణ కౌరవులని, ఎంత మంది ఎక్కినా ఒకరికి చోటుండే పుష్పక విమానాలను రూపొందించారని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు తప్ప వేదాల్లో ఉన్నవాటిని వెలికి తీసింది లేదు. శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగం నిర్దేశించగా దానికి విరుద్ధంగా సిలబస్ నుంచి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించారు. మనుషులు బ్రహ్మ ముఖం, కాళ్లు చేతులు, ఇతర భాగాల నుంచి పుట్టారని టీచర్లు చెప్పాలన్నమాట. ఎలాంటి వారి చేతుల్లో చిక్కుకున్నాం, రాజ్యాంగాన్ని దెబ్బ తీయటం అంటే ఇదే. ఇలాంటి పాలకులు సైన్సు గురించి జనానికి ఎందుకు బోధిస్తారు..?? పరిశోధనలకు నిధులు ఎందుకు కేటాయిస్తారు..??
● సైన్సు సలహా మండలి సిఫార్సు ఏమైంది..??
నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రిసర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని 2005లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు జాతీయ సైన్సు సలహా మండలి సిఫార్సు చేసింది, 2008లో ఆమోదం తెలిపారు. ఆ మేరకు ఒక చట్టాన్ని చేశారు. తరువాత మోడీ సర్కార్ అనుసంధాన్ నేషనల్ రిసర్చ్ ఫౌండేషన్ (ఎన్.ఆర్.ఎఫ్) పేరుతో 2023లో ఒక చట్టాన్ని తెచ్చింది. అంతకు ముందు ఎన్ని కబుర్లు చెప్పినా ఇక చూడండి అంటూ 2023 నుంచి 2028 కాలంలో 50 వేల కోట్ల రూపాయలతో పరిశోధనలు చేపడతామని చెప్పారు. ఈ మొత్తాన్ని సమీకరించేందుకు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. 70 శాతం నిధులు ప్రెవేట్ రంగం నుంచి సేకరిస్తామన్నారు. దీనికి ప్రధాన మంత్రే అధ్యక్షత వహిస్తారు. త్వరలో దేశాన్ని అమెరికా, చైనాల సరసన నిలబెడతామంటున్నారు. మహానుభావులు ఊరికే కబుర్లు చెప్పకూడదు కదా. ఆ స్థాయికి చేరటానికి ఒక మార్గం పరిశోధనా రంగానికి పెద్ద మొత్తంలో కేటాయించాలి.
● ప్రపంచంలో ఈ కేటాయింపు జిడిపిలో సగటున రెండు శాతం ఉంది.
మన దేశంలో 2009-10లో గరిష్టంగా 0.82 శాతం ఉండగా అది మోడీ అధికారానికి వచ్చేనాటికి 0.7 శాతానికి తరువాత 2024-25 ఆర్థిక సర్వే పేర్కొన్నదాని ప్రకారం 0.64 శాతానికి దిగజారింది. ఎన్‌ఆర్‌ఎఫ్ ద్వారా ఐదేళ్లలో ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా 2023-24లో రూ 2,000 కోట్లు కేటాయించి తరువాత దాన్ని కేవలం రూ 258.6 కోట్లకు సవరించారు. వీరు దేశాన్ని ఉద్ధరిస్తారు, యువ పరిశోధకులను ప్రోత్సహిస్తారని ఆశించి భజన చేయాలి.
● చైనాను త్వరలో అధిగమిస్తామని, ప్రపంచ వస్తు ఉత్పత్తిదారుగా మారతామని కొంత మంది చెబుతుంటారు.
మంచిదే, కాని ఆచరణ ఏమిటన్నది ప్రశ్న. 1990 దశకంలో భారత్ - చైనా రెండూ పరిశోధనలకు జిడిపిలో కేటాయించిన మొత్తం 0.7 శాతమే. కానీ నేడు చైనా 2024లో 2.68 శాతం ఖర్చు చేసింది. 2025-26 మన కేంద్ర బడ్జెట్ డాలర్లలో 584 బిలియన్లు కాగా 2024లో చైనా ఒక్క పరిశోధనకు ఖర్చు చేసిన మొత్తమే 496 బిలియన్ డాలర్లు. అర్ధం అవుతోందా,
కేంద్ర ప్రభుత్వం 2024 నవంబరు 29న పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం పది సంవత్సరాలలో మన పరిశోధన ఖర్చు జిడిపిలో 0.6 - 0.7 శాతం మధ్య ఉండగా ఇజ్రాయిల్ 5.4, అమెరికా 3.5 శాతాల చొప్పున ఖర్చు చేస్తున్నాయి. మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి అన్నట్లు కబుర్లు చెబితే దేశం ముందుకు పోదు. అన్న నెహ్రూయే చేశారు అని చెప్పే పెద్దలు పరిశోధనకు నిధులు పెంచకుండా ఎవరు అడ్డుకున్నారు.
● పోనీ మన దేశం పరిశోధనలకు దూరంగా ఉందా అంటే లేదు.
గోమూత్రంలో బంగారం ఎంతుంది, పేడలో ఏముంది అంటూ శోధిస్తున్నారు. సంఘపరివార్ భావజాలానికి అనుగుణంగా ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు జన్యు పరిశోధనలు చేసి దేశంలో ఉన్న జనాభాలో ‘శుద్ధమైన జాతి’ ఏదో తేల్చేందుకు 2022లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిధులు ఇస్తున్నదనే వార్తలు వచ్చాయి. ఇది ప్రమాదకరమని, విరమించాలని జన్యుశాస్త్ర నిపుణులు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు 120 మంది నాడు కేంద్రానికి లేఖ రాశారు. జన్యు చరిత్రను తెలుసుకోవటం అనే కారణాన్ని ప్రభుత్వం చెప్పింది. వివిధ ప్రజా సమూహాల నుంచి గతంలో డిఎన్‌ఏలను సేకరించి చేసిన విశ్లేషణ ప్రకారం అనేకవాటి సమ్మిళితం అని తేలింది. ఫలానా జన్యువులు ఉన్నవారు పరిశుద్ధులు అంటే మిగతావారిని అవమానించే తీర్పు తప్ప సైన్సు కాదు.
● ఇలాంటి గురువుల శిష్యులు చేస్తున్నదేమిటి.
సంఘపరివార్ ఏర్పాటు చేసిన అనేక సంస్థలలో ఆరోగ్యభారతి ఒకటి. అది గర్భ విజ్ఞాన సంస్కార్ పేరుతో ఒక ప్రాజెక్టు నడుపుతున్నది. ఆజానుబాహులు, మంచి రంగు, రూపుతో ఉండే పిల్లలను పుట్టిస్తామని అబద్ధాలు చెప్పుకుంది. గుజరాత్‌లో మొదలెట్టి దేశమంతటా దీన్ని విస్తరించేందుకు తలపెట్టారు. అనేక చోట్ల ఈ మేరకు సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. జర్మన్ హిట్లర్ ఆర్య జాతి ఉత్తమమైనదని చెప్పినట్లుగానే ఉత్తమ హిందూజాతిని, హిందూ దేశభక్తులను రూపొందించేందుకు ఈ ప్రయత్నాలని జనాలను నమ్మిస్తున్నారు. జర్మన్ కాని సైన్సు పుస్తకాలను 1933లో నాజీలు తగులబెట్టారు. వాటిలో నాజీల భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నవాటితో పాటు యూదు రచయితలు రాసినవి ఉన్నాయి. మన దేశంలో అలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నెల్లూరులో సింహపురి పుస్తక మహోత్సవంపై దాడి చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడున్న ప్రజలే వారిని తిప్పికొట్టారు. తిరుపతి పుస్తక మహోత్సవంలో కాషాయ మూకలు దాడులకు పాల్పడ్డాయి. అలాగే విశాలాంధ్ర స్టాల్ మీద దాడి చేశారు. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం మీద దాడి చేశారు.
చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాం. కొన్నింటిని నాశనం చేస్తే తరువాత వేలాది యంత్రాలు వచ్చాయి, వస్తాయి. అలాగే పుస్తకాలను అడ్డుకుంటే భావజాల వ్యాప్తి ఆగుతుందా. పురాతన తక్షశిల విద్యాకేంద్రాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన మన దేశంలో భావజాల వ్యాప్తి ఆగిందా. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలని చూసే బాపతు గురించి వేరే చెప్పాలా. ఇలాంటి వారు అజ్ఞానాన్ని తప్ప విజ్ఞాన శాస్త్రాలను ప్రోత్సహిస్తారా..?? పరిశోధన, అభివృద్ధికి నిధులు కేటాయిస్తారా..?? దేశాన్ని మధ్యయుగాల నాటికి తప్ప ముందుకు తీసుకుపోతారా..??

0 Comments