Breaking News

Loading..

సృజనాత్మకత కోల్పోతున్న 'స్వతంత్ర భారతం'.


ఖమ్మం, మార్చి 01, బిసిఎం10 న్యూస్.

జనాభా పరంగా అన్ని దేశాల కంటే ముందున్న మనం శాస్త్రీయ ఆవిష్కరణల విషయంలో ఎక్కడ ఉన్నాం. ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనం ఎన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించాం. ఎన్ని అసలైన కొత్త ఆవిష్కరణలు చేశాం. అనే విషయాలను ఒకసారి నిక్కచ్చిగా పరిశీలిస్తే, విజ్ఞానశాస్త్ర రంగంలో మనం సాధించిన ప్రగతిలో ఎంత డొల్లతనం ఉందో అర్థమవుతుంది. ఆధునిక భారతీయులు ఈ దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకు దూసుకుపోతోందని బీరాలు పలకవచ్చు, కానీ వాస్తవం దానికి దూరంగా ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం, భారతదేశంలో సివి రామన్, జగదీష్ చంద్రబోస్, ఎల్లాప్రగడ సుబ్బారావు, సత్యేంద్రనాథ్ బోస్, హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్ వంటి ఎంతో మంది గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. తమ విలక్షణమైన ఆవిష్కరణ లతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన శాస్త్రవేత్తలు ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంత మంది ఉన్నారు.

● నిజమే మనం నింగిలోకి చాలా రాకెట్లు పంపిస్తున్నాం.

కానీ రాకెట్ టెక్నాలజీ మనం కనుక్కోలేదనే విషయం మర్చిపోకూడదు, అలానే మన సాఫ్ట్‌వేర్ నైపుణ్యం కూడా. ఇప్పుడు మనం అనుభవిస్తున్న టెక్నాలజీ కానీ, మనకున్న శాస్త్ర పరిజ్ఞానం కానీ చాలావరకు అరువు తెచ్చుకున్నదే. మనం సొంతంగా చేసిన ఆవిష్కరణలు, కనుక్కున్న సిద్ధాంతాలు ఈ ఆధునిక యుగంలో బహుతక్కువ అని చెప్పాలి. భారతదేశాన్ని విశ్వ గురువు అని చెప్తుంటారు మనవాళ్ళు. మరి అటువంటి దేశానికి ఈ ఆధునిక యుగంలో ఎందుకు ప్రతిదాన్ని పశ్చిమ దేశాల నుంచి అరువు తీసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. మనలోని సృజనాత్మకత, ఆలోచనాశక్తి ఏమైపోయాయి. మనకి భావదారిద్య్రం ఎలా ఆవహించింది, భారతీయులు ఆలోచించాలి.

● అనుకరణలో సిద్ధహస్తులమయ్యాం.

మన పూర్వికులు పరాయి పాలనలో ఉండి కూడా గొప్ప విషయాలు కనుక్కున్నారు, ప్రపంచానికి మార్గదర్శకులు అయ్యారు. కానీ స్వతంత్ర పాలనలో ఉండి కూడా మనం వారిలో ఇసుమంత కూడా సాధించలేకపోతున్నాం. ఎందుకంటే మన పూర్వికులు పరాయి పాలనలో ఉన్నా కూడా స్వతంత్రంగా ఆలోచించారు, స్వతంత్రంగా జీవించారు. మనమేమో స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా పరాయి వాళ్ళ అధీనంలోనే బతుకుతున్నాం. మన మనస్సు, ఆలోచనలు, చదువులు, వేషభాషలు అన్నీ పూర్తిగా ఇంగ్లిష్ వాళ్ళ ఆధీనంలోనే నడుస్తున్నాయి. మనకంటూ స్వంత ఆలోచన, విధానం లేదు, అనుకరణలో సిద్ధహస్తులమయ్యాం, ఆవిష్కరణలో వెనుకబడ్డాం. అనుకరించేవారు ఎంత అభివృద్ధి సాధించినా ఎప్పుడూ వెనుకనే ఉంటారు.

● స్వతంత్రంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి.

మన దేశం శాస్త్ర, సాంకేతిక రంగంలో ముందుకు దూసుకుపోవాలంటే మనం ఈ కాపీ పేస్ట్ సైకాలజీని, బానిస మనస్తత్వాన్ని వదిలించుకోవాలి, స్వతంత్రంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. దానికి మన పిల్లలు ముందు మాతృభాషలో విద్యను అభ్యసించాలి. పిల్లల మనోవికాసానికి, వారిలో సృజనాత్మకతను పెంపొందించటానికి మాతృభాష లో విద్యాభ్యాసం ఎంతగానో దోహదపడుతుంది. ప్రపంచంలో అనేక చిన్న దేశాలు మాతృభాషలో విద్యాబోధన వల్లనే శాస్త్రసాంకేతిక రంగాల్లో అగ్రగాములుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మనం మన పూర్వికుల అసలు చరిత్రను చదవాలి. అలానే పాశ్చాత్య శాస్త్రాలతో పాటు, ప్రాచీన భారతీయ శాస్త్రాలను కూడా లోతుగా అధ్యయనం చెయ్యాలి. అప్పుడే పూర్వికుల సృజనాత్మకతను మనం తిరిగి పుణికిపుచ్చుకోగలం, స్వతంత్ర ఆలోచనలు, ఆవిష్కరణలు చేయగలం.

Post a Comment

0 Comments