Breaking News

Loading..

న్యాయ వ్యవస్థ పై రాజకీయ పెత్తనమా..!!


ఖమ్మం, మార్చి 29, బిసిఎం10 న్యూస్.

ఇటీవల ఉన్నత న్యాయస్థానాలలో కొంతమంది న్యాయమూర్తుల వ్యవహార శైలి పెద్ద చర్చనీయాంశమైంది. తాజాగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరగడం, ఆ మంటలు ఆర్పడానికి వెళ్ళిన ఫైర్ సిబ్బందికి పెద్ద ఎత్తున బస్తాలలో కాలిన కరన్సీ నోట్ల కట్టలు కనిపించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక బాలిక పై అత్యాచార ప్రయత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా ఇచ్చిన తీర్పు పై సుప్రీంకోర్టు ఇటీవలే తీవ్రంగా స్పందించింది. ఆయన అత్యాచారానికి ఇచ్చిన నిర్వచనం అర్ధరహితమని తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తూ, ఆయన ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. హైకోర్టులో ఆయన ఇచ్చిన తీర్పు ఏంటంటే పురుషుడు ఒక మహిళ ఛాతి పై చేతులు వేయడం, ఆమె పైజామా తాడు లాగడం వంటివి అత్యాచార ప్రయత్నం, లైంగిక వేధింపు కిందకు రాదని ఆయన తీర్పు. ఇంకా విచిత్రం ఏమిటంటే అది నేరమేనని క్రింది కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ నేరస్థుడు హైకోర్టుకు వెళ్లగా, అలహాబాద్ హైకోర్టు ఇటువంటి తీర్పును ఇచ్చింది. ఇటువంటి తీర్పే నాలుగేళ్ల క్రితం ముంబాయి హైకోర్టు జడ్జి జస్టిస్ పుష్ప గణేదివాలా కూడా ఇచ్చారు. ఈ జడ్జి స్వయంగా ఒక మహిళ కావడం కొస మెరుపు.

● తప్పుడు తీర్పులకు శిక్ష లేదా..??

ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది, అదేమిటంటే ఇంత నీచమైన తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తికి శిక్ష ఏమిటని..?? అలాంటివారు ఆ స్థానంలో ఉండడానికి అర్హులేనాని..?? ఇటువంటి తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులకు చట్టం ఏం అర్థమైనట్టు, మహిళల హక్కుల గురించి ఏం అవగాహన ఉన్నట్లు, అసలు రాజ్యాంగం పట్ల ఏమైనా గౌరవం ఉందా అనే సందేహాలు కలుగుతాయి. ఇటువంటి తీర్పు పై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, స్టే ఇవ్వడం వరకు బాగానే ఉంది. కానీ, అటువంటి న్యాయమూర్తి పై ఏ చర్య తీసుకున్నారు అన్నది ప్రశ్న. ఏ చర్యా తీసుకోకపోతే ఇటువంటి తీర్పులు ఇంకా వస్తూనే ఉంటాయి.

● బిల్కిస్ బానో.

బిల్కిస్ బానో అనే గర్భిణీ స్త్రీ పై 2002 గుజరాత్ మారణ కాండలో సామూహిక అత్యాచారం జరిగింది. అంతేకాకుండా ఆమె కుటుంబంలోని 14 మంది హత్యకు గురయ్యారు. 2008లో ప్రత్యేక సిబిఐ కోర్టు 11 మంది పురుషులకు జీవిత ఖైదు విధించింది. ఆగస్టు 2022లో ఈ 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ఉపశమన విధానం కింద విడుదల చేసింది, ఇది ప్రజల ఆగ్రహానికి దారితీసింది. మార్చి 2024లో, సుప్రీంకోర్టు వారి ఉపశమనాన్ని రద్దు చేసి, వారిని తిరిగి జైలుకు పంపాలని ఆదేశించింది.

● ఇక్కడ తప్పుడు తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తులకు శిక్ష ఏది..??

సాధారణ ఉద్యోగి తప్పు చేస్తే శిక్ష కఠినంగా ఉంటుంది. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు కొన్ని జీవితాలను, కుటుంబాలను జీవితాంతం ప్రభావితం చేస్తాయి. అలాంటప్పుడు పదేపదే తప్పుడు తీర్పులకు కఠినమైన శిక్ష లేకపోతే ఎలా..??

● జవాబుదారీతనం.

న్యాయస్థానాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నా పూర్తిగా జవాబుదారీతనం కూడా ఉండాలి. తమకు ఇష్టం వచ్చినట్లు తీర్పులు ఇస్తూ పోతామని అనుకుంటే అది పొరపాటే అని స్పష్టంగా తెలియాలి. ప్రజాస్వామ్య భారతదేశంలో అన్ని వ్యవస్థలు అంతిమంగా ప్రజలకు జవాబుదారీగానే ఉండాలి. దేనికి అదే స్వతంత్రంగా పనిచేసినా, అన్నీ అంతిమంగా రాజ్యాంగానికి లోబడే ఉండాలి. ఆ రాజ్యాంగం ప్రజలచే రూపొందించబడింది. కాబట్టి ప్రజలకు అన్ని వ్యవస్థలు జవాబుదారీగానే ఉండాలి, ఇందులో న్యాయ వ్యవస్థకు మినహాయింపేమీ లేదు. అలాగే నేడు అవినీతి, లంచగొండితనం, బంధుప్రీతి, వనరుల దోపిడీ వంటివి సమాజంలో విశృంఖలంగా చెలరేగుతున్న సమయంలో న్యాయ వ్యవస్థ అన్ని వేళలా వీటికి అతీతంగా ఉంటుందని భావించలేం. ఇది కూడా రాజ్యాంగ యంత్రంలో భాగమే కదా. అందువల్ల ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, కుళ్ళును నిర్మూలించే చర్యలు చేపట్టకపోతే, కొన్నాళ్ళకు మొత్తంగానే కుళ్లిపోతుంది. మన న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పదిగా పేరుగాంచింది. అనేక మంచి తీర్పులు ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడిన చరిత్ర దీనికుంది. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకోవాలి.

● దొంగ డబ్బు.

న్యాయమూర్తి ఇంట్లో నగదు పై సుప్రీంకోర్టు అంతర్గత విచారణకు ఆదేశించింది. అలాగే పార్లమెంటులో కూడా చర్చ జరిగింది. దేశ ప్రజలను ఈ ఘటన ఆశ్చర్యపరిచింది. వర్మ తన ఇంట్లో దొరికిన డబ్బులతో తనకి ఏమీ సంబంధం లేదని తెలుపుతున్నారు. ఏమీ సంబంధం లేకపోతే ఆయన ఇంట్లోకి పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నదే పెద్ద ప్రశ్న. ఒక న్యాయమూర్తి ఇంట్లోకి ఇతరుల చొరబడే అంత లోపభూయిష్టంగా మన భద్రతా వ్యవస్థ ఉందా అన్న సందేహం కూడా కలుగుతుంది.

● సుప్రీం ప్రధాన న్యాయమూర్తి.

ఇంతకుముందు కూడా న్యాయమూర్తుల పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదనే ఆయన వద్ద పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి వేధింపులకు చికిత్స చేసినట్లు కంప్లైంట్ ఇచ్చింది, అయితే ఏ చర్య తీసుకోలేదు. ఇంకా విశేషమేమిటంటే బాబ్రీ మసీదు కేసు వెలువడిన తరువాత, ఆ కేసులో బిజెపి నాయకులందరూ నిర్దోషులేనని తీర్పు వచ్చిన తరువాత, సాంప్రదాయాలకు భిన్నంగా, పదవీ విరమణ చేసిన కొద్ది కాలానికే రాజ్యసభ సీటు ఇచ్చి అధికార పార్టీ ప్రధాన న్యాయమూర్తిని సత్కరించింది కూడా. తీర్పు నిష్పాక్షకతను ఇలాంటివి ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

● సన్నగిల్లుతున్న విశ్వసనీయత.

ఇలాంటివి చాలా ఉన్నాయి, చేస్తున్న చర్యలు కూడా న్యాయ వ్యవస్థ పై ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేలా ఉన్నాయి. ఉదాహరణకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వర్మను ఈ ఉదంతం తరువాత మాతృ కోర్టు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అక్కడ బార్ అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఖండించడమే కాక విధులను కూడా బహిష్కరిస్తున్నట్లుగా చూపించారు. ఇలాంటి వారందరిని బదిలి చేయడానికి అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్త కుప్పా..?? అని చాలా పరుష పదజాలంతో స్పందించింది, దీనికి న్యాయ వ్యవస్థ సిగ్గుపడాలి.

● కేంద్ర ప్రభుత్వ కుట్రలు.

సందట్లో సడేమియాలా పార్లమెంటులో చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన అసలు స్వరూపాన్ని మరోసారి బయట పెట్టుకుంది. సుప్రీంకోర్టుతో సహా అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న మోదీ ప్రభుత్వానికి న్యాయమూర్తుల పై వస్తున్న ఆరోపణలన్నీ అవకాశంగా దొరికాయి. అందువల్ల గత పదేళ్లుగా తీవ్రంగా ప్రయత్నం చేయడం సాధ్యం కానటువంటి ఒక బృహత్తరది ఇప్పుడు మళ్లీ తెర మీదకు తీసుకువచ్చింది. అదేమిటంటే కొలీజియం వ్యవస్థ రద్దు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం, బదిలీలు, ప్రమోషన్లు చూడడానికి ప్రభుత్వం జోక్యం లేకుండా న్యాయమూర్తులతో కూడిన ఒక కొలీజియం వ్యవస్థ ఉంది. ఇది న్యాయవ్యవస్థ పై పూర్తి పట్టు సాధించడానికి, తనకు అనుకూలమైన న్యాయమూర్తులను నియమించడానికి, బదిలీలు వారికి మోడీ ప్రభుత్వానికి ఆటంకకరంగా నిలబడింది. అందుకే దీనిని ఎలాగైనా మార్చాలని 2014లోనే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంటులో ఎన్జెఎసి (నేషనల్ జ్యూడిషల్ అపోయింట్మెంట్స్ కమిషన్) చట్టం 2014లో తెచ్చింది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని 2015లో కొట్టివేసింది. ప్రస్తుతం మళ్లీ తన పట్టు బిగించడానికి మోదీ ప్రభుత్వానికి అవకాశం వచ్చింది. అదే కానీ జరిగితే న్యాయ వ్యవస్థకున్న ఈ మాత్రం జవాబుదారీతనం కానీ, విశ్వసనీయత కానీ ఇక నిలబడదు. ఇప్పటికే ఎన్నికల కమిషన్, దర్యాప్తు సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకున్న మోదీ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థను కూడా కబళిస్తే ఇక పూర్తిగా నియంతృత్వం వైపే దారి తీస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితులను నిలబెట్టవలసిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతని నిలుపుకోవడం ప్రజాస్వామ్యానికి అత్యవసరం. అదే సందర్భంలో పూర్తి పట్టు కై అర్రులు జాస్తున్న మోదీ ప్రభుత్వ దుశ్చర్యలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య మనుగడకు అవసరం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత, రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత ప్రజలదే అనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో దేశ ప్రజలందరూ స్పందించవలసిన అవసరం ఉంది. అదే సందర్భంలో లోపాలను కూడా సరిచేసుకోవాలి. అయితే ప్రస్తుతం భారత న్యాయవ్యవస్థ సమర్ధవంతంగా న్యాయం అందించే అడ్డుకునే అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.

● న్యాయంలో జాప్యం.

తీర్పులలో తీవ్ర జాప్యం అనేది అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి. వివిధ కోర్టులలో భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందుబాటులో ఉన్న తాజా డేటా ప్రకారం కోర్టులలో సుమారు 2.84 కోట్ల కేసులు, హైకోర్టులలో 43 లక్షలు, సుప్రీంకోర్టులో 57,987 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీం కోర్టులో 1986 నాటి ఒక కేసు 39 సంవత్సరాలైనా ఇంకా పెండింగులోనే ఉంది. కేసులు నడుస్తుండగానే కక్షిదారులు చనిపోతున్న సందర్భాలేకం. కోర్టుల కెళితే సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజలకు లేదు. ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే కోర్టులో కేసు వేస్తానని బెదిరించడం ఒక రివాజుగా మారింది. 'జస్టిస్ డిలేయెడ్ ఇస్ జస్టిస్ రేజెక్టెడ్' అన్నది నేడు సాధారణం అయిపోయింది. దీర్ఘకాలం కేసుల పెండింగుకు న్యాయమూర్తులు, సిబ్బంది, మౌలిక వసతుల కొరత ప్రధాన కారణాలు.

● తక్కువ న్యాయమూర్తులు - ప్రజల నిష్పత్తి.

భారతదేశంలో ప్రతి 48,000 మందికి ఒక న్యాయమూర్తి ఉన్నారు. పనిభారం అమెరికా కంటే సుమారు ఆరు రెట్లు ఎక్కువ. హై కోర్టు, క్రింది కోర్టులలో దాదాపు 30 శాతం జడ్జీల పోస్టుల ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి సుప్రీం కోర్టు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ప్రభుత్వాల నుండి సరైన స్పందన కరువైంది.

● పారదర్శకత లేకపోవడం.

న్యాయవ్యవస్థ పనితీరు, నిర్ణయం తీసుకునే ప్రక్రియలలో పారదర్శకత లేకపోవడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. న్యాయమూర్తులను నియమించే ప్రక్రియ తరచుగా నెమ్మదిగా, వివాదస్పదంగా ఉంటోంది.

● సరిపోని ప్రాథమిక సౌకర్యాలు.

భారతదేశంలోని అనేక కోర్టులలో సాంకేతికతతో సహా ఆధునిక సౌకర్యాలు లేవు. ఇది కేసుల సమర్ధవంతమైన పరిష్కారానికి ఆటంకం కలిగిస్తోంది. కొన్ని కోర్టులలో కనీస మౌలిక వసతులు కూడా లేవు. కక్షిదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

● అవినీతి.

న్యాయవ్యవస్థలోని అవినీతి విశ్వసనీయత, ప్రభావం దెబ్బతీస్తోంది. నిప్పుకు చెద పట్టడం అంటే ఇదే. ఈ సవాళ్లను సర్దుబాటు చేయడం, న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం, కోర్టులలో మౌలిక సదుపాయాలను అందించడం, స్వతంత్రతను కాపాడుతూనే న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం వంటి సమగ్ర సంస్కరణల అవసరం ఉందన్నది మా అభిప్రాయం.

Post a Comment

0 Comments