Breaking News

Loading..

దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ పై టీమిండియా ఘన విజయం.


దుబాయ్, ఫిబ్రవరి 23, బిసిఎం10 న్యూస్.

దుబాయ్ వేదికగా జరిగిన అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లో పాకిస్తాన్‌ పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. చాలా రోజుల తర్వాత కింగ్ కోహ్లీ (100) మళ్లీ ముందుండి ఛేజింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. తన కెరీర్‌లో 51వ సెంచరీ సాధించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌' గా నిలిచాడు. అతడికి శ్రేయస్ అయ్యర్ (56), శుభ్‌మన్ గిల్ (46) సహకరించారు. రోహిత్ శర్మ (20), హార్దిక్ (8) త్వరగానే అవుట్ అయ్యారు. కోహ్లీ, గిల్, శ్రేయస్ పిచ్‌ను పూర్తిగా అర్థం చేసుకుని పరుగులు రాబట్టారు. కోహ్లీ, శ్రేయస్ పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చక్కటి సమన్వయంతో ఆడారు. ముఖ్యంగా కోహ్లీ చాలా రోజుల తర్వాత తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. అద్భుతమైన కవర్‌డ్రైవ్‌లతో ఎంతో ఆత్మవిశ్వాసంగా ఆడాడు. పాక్ ఫీల్డర్లు క్యాచ్ వదిలేయడం కూడా కోహ్లీకి కలిసి వచ్చింది. మరోవైపు శ్రేయస్ కూడా సాధికారికంగా ఆడాడు. అనవసర షాట్లు కొట్టకుండా సమయోచితంగా రాణించాడు. 56 పరుగులు చేసి చివర్లో అవుట్ అయ్యాడు. పాక్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. దీంతో భారత్ 42.3 ఓవర్లలోనే పాకిస్తాన్ నిర్దేశించిన టార్గెట్‌ను చేరుకుంది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రిజ్వాన్ (77 బంతుల్లో 46), షకీల్ (76 బంతుల్లో 62) చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించారు. కుల్‌దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకున్నారు. హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్ చేసి ఇద్దరిని రనౌట్ చేశాడు. ఈ టోర్నీలో భారత్ తన తర్వాతి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో మార్చి 2వ తేదీన ఆడబోతోంది.

Post a Comment

0 Comments