Breaking News

Loading..

'కోళ్ళ పందాలు' ఓ ఆర్గనైజ్డ్ దోపిడీ..!!

ఖమ్మం, జనవరి 15, బిసిఎం10 న్యూస్.

ఒక రకంగా చెప్పాలంటే ఉల్వచారు లాగా ఈ కోడి పందాలు అనేవి కూడా విపరీతమైన హైప్ తో వండి వార్చిన రుచి పచి లేని ఓ ఓవర్ రేటెడ్ వంటకం అన్నమాట. అక్కడ పెద్ద పెద్ద కారుల డాబు, బెట్టింగ్ ల జోరు, క్యాసినోలు, గుండాట, లోపల బైటా పత్తాల ఆట, నంబరింగ్ ఆటతో పాటు గుప్పుమనే చీప్ లిక్కర్, పలావ్ వాసనతో బరుల చుట్టూ భారీ సెట్టింగ్ లు, లైటింగ్ లు, ఫ్లెక్సీల హంగామా. జనం సందడి తప్ప ఆ కోడి పందేలలో మీరు ఊహించినది అంతా డ్రామా, మీరు ఆశించినంత ధ్రిల్ మాత్రం ఉండదనే చెప్పాలి. నిజం చెప్పాలంటే పార్కింగ్ నుండి బయటకు వచ్చే వరకు అంతా దోపిడీనే. నిజానికి ఇదో పెద్ద సీజనల్ ఇల్లీగల్ ధంధా. ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర నుండి మొదలయ్యే దోపిడీ (ఓన్లీ కార్ పార్కింగ్ కే కొన్ని చోట్ల రెండు వందల నుండి మూడు వందల రూపాయలు) గుండాట, మట్కా, నంబరింగ్ ఆట, ఇప్పుడు కొత్తగా అత్యాధునిక కేసినో లు, రికార్డు డ్యాన్సులతో జరిగే నిలువు దోపిడీ అయితే వేరే లెవెల్. ఇక లిక్కర్ పలావ్ రేట్లు సరే సరి, ఈ దోపిడీ అంతా ఒక పద్ధతి ప్రకారం, పక్కా వ్యవస్థీకృతంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా రోజువారీ పనులు చేసుకొనే వాళ్ల నుండి చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వాళ్ల వరకు వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు అందరు తమ జేబుకు ఖాళీ చేసుకొని బయటకు రావాల్సిందే. ఇక సామాజిక కోణంలో చూస్తే కొన్ని అధికాదాయ వర్గాల బడాయి మాటున సంక్రాంతి సంస్కృతి పేరుతో ఎక్కువ దోపిడీకి గురవుతుంది కూలీ నాలీ చేసుకునే జనమే.

కానీ ఈ కోళ్ళ పందేలు అనేవి మొదటి నుండి సంక్రాంతిలో భాగం అయినట్టు, అదే మన తెలుగు వారి సంస్కృతి అసలైన సంక్రాంతి విశిష్టత అయినట్టు టిఆర్పి రేటింగుల కోసం పాకులాడే సోకాల్డ్ మీడియా ద్వారా కొంత మంది సాంప్రదాయ వాదులు ద్వారా మన బ్రెయిన్ ఒక పద్ధతి ప్రకారం కండిషనింగ్ చేయబడుతుంది అన్నమాట. ఇక కొంత మంది బడాబాబులు వాళ్ళని అనుకరించే వాళ్ళ ఫాల్స్ ప్రెస్టిజ్ సంగతి సరే సరి. ఇక్కడ విషాదం ఏంటంటే ఇదే మన అసలైన సంక్రాంతి కల్చర్ అంటూ అందరి చేత ముక్కమ్మడిగా యాక్సెప్ట్ చేయించడంలో మాత్రం రాజకీయనాయకులు నుండి మీడియా వరకు అందరూ విజయవంతం అయ్యారు. మొదట్లో గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు క్రమేపీ కోస్తా అంతా వ్యాపించడం ఇదంతా కేవలం ఈ పదిహేను ఇరవై ఏళ్లలో మన కళ్ళ ముందే జరిగిన వైచిత్రం. ఇక కోడి పందేల విషయానికే వస్తే ఎలాగు కోళ్ళకు కత్తి కట్టి వదిలే పందేమే కాబట్టి మనం అటూ ఇటు చూసే లోపు రెండే రెండు నిమిషాల్లో రెండిటిలో ఓ కోడి మెడ వాల్చుతుంది, పందెం అయిపోతుంది. ఆ జనం గోలలో గెలిచిన కోడి ఎదో ఓడిపోయిన కోడి ఎదో మనకు అర్థం కూడా కాదు. ఆ పాటి దానికి ఆ కోడి పందాలతో పోలిస్తే జల్లికట్టు, ఎద్దుల పందేలు, బండ లాగుడు, బండి లాగుడు, పోలుదార పోటీలు, పొట్టెళ్ళు, పందుల పోటీలు వంద రెట్లు నయం. వీటిలో కొంత నిజాయితీ, నైతికతన్నా ఉందన్నది మా వాదన.

Post a Comment

0 Comments