సూర్యునితో పాటుగా నిద్ర లేవాల్సి రావడం, ఎవరికీ ఒంట బట్టని, అంతు బట్టని డిత్రీ ను రోజూ ఉచితంగా పొందడం ముగ్గులో మగువలే కదా పొందేది. రంగవల్లి కొరకు రంగస్థలం సిద్ధం చేయడానికి సరైన పొరక ను ఎంచుకోవడం, దాని కొరకు విభిన్న మొక్కల రకాలను పరిశీలన చేయడం, ఋతువును బట్టి ఆయా పొరకల్ని తయారీ చేసి, వాడుకోవడం
మామూలు మాటేనా. నేలను అనుకూలంగా చేయడానికి పలుగు, పార పట్టడం, నిత్యం చదును చేసుకోవడం, ఇంటి మగవారికి చిన్న చిన్న పనుల్ని చెప్పడం, వారినీ అప్పుడప్పుడు ముగ్గుల్లో దింపడం జీవన మాధుర్యం అనుభవించడమే కదా. కళ్ళాపి చల్లడానికి ఏ రోగంతో లేనిది, ఊరవతల సహజ ఆకులు, అలములు తినొచ్చిన ఆరోగ్యకరమైన ఆవు యొక్క పేడను ఎంచుకోవడం (ఇంట్లో మనం వేసే చెత్త తిండి తిని, చెత్త నీళ్లు తాగి, అస్సలు నాలుగు అడుగులు అలా అడవిలో తిరగని ఆవు పేడను ఎంచుకోవద్దు. ఇప్పటిలా రంగు నీళ్లు చల్లి కొత్త రోగాలు తెచ్చుకోవద్దు) గొప్పతనమే కదా. ముగ్గు కొరకు సరైన తెల్లని, మెత్తని రాతి ముగ్గు ఎంచుకోవడం, అలా ఉండకపోతే దానిని అనుకూలంగా మార్చుకోవడం, దానిలో బియ్యం పిండి లాంటివి కలుపుకోవడం (ఇలా పిండి కలపడం వలన పశు, పక్ష్యాదులు, చీమల లాంటి కీటకాలు రోజూ కొంత కడుపు నింపుకుంటాయి) వెనుక పుణ్యం, పురుషార్ధాలు రెండూ ఉండవా. గొబ్బెమ్మల పేరిట రేగు పళ్లు, పిండి కొమ్మల పేరిట అడవికి వెళ్లి స్వచ్చమైన గాలిని పీల్చి, జీవవైవిధ్యంలో భాగమవుతూ ఆరోగ్యాన్ని తెచ్చుకోవడం మామూలు మాటేనా. ఆవు పేడని ఎంచుకోవడం మొదలు, వాటిని అందంగా ఒత్తి, వాటి పై రేగు పళ్లు, పిండి కొమ్మలు, నవ ధాన్యాలు వేసి గొబ్బెమ్మలుగా అలంకరించుకోవడం వెనుక ఎంత హస్త కళ ఉంటుందో ఆలోచించారా. కెమికల్స్ లేని ఇంటి రంగులను తయారు చేసుకోవడం, వాటి కొరకు రకరకాల పిండి, పొడులు, ఆకులు, పువ్వుల చూర్ణం, కుంకుమ, పసుపు లాంటివి ఎంచుకోవడం, వివిధ వర్ణాల/రంగుల మీద పట్టు సాధించి కలర్ థెరపీ లో సిద్ధహస్తులు కావడం, పుష్పాల వాడుకలో ఆరితేరి ఆరోమా థెరపీ లో ప్రావీణ్యం పొందడం ఎప్పుడైనా గుర్తుపట్టారా. ఇక ఒకొక్క ముగ్గు కొరకు ముందు రోజే ఒక మానసిక యుద్ధం చేయడం, ప్రతి ఇల్లాలు పక్కింటి ముగ్గు కంటే మెరుగ్గా ఉండేలా తన మేధస్సుకు పదును పెట్టి, సృజనాత్మకతను రంగరించి రంగవల్లి లో ఒలకబోయడం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనుకోవాల్సిందే. ఇంటిల్లిపాది వెలుగును చూడకముందే ఇంటి ఇల్లాలు చీకట్ల ఇక్కట్లను పట్టించుకోకుండా, ఇంటిల్లిపాది మెలకువ వచ్చి ఇంటిముందుకు రాగానే ఒక గొప్ప కళాకృతిని చూపించి ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ అనేలా, ఒక గొప్ప ఆర్టిస్ట్ లా మారి, ఆ రోజంతా ఫీల్ గుడ్ హార్మోన్ లు పొందేలా మెస్మరైజ్ చేయడం, ఆ రోజంతా తనవారిని హిప్నటైజ్ చేస్తూ, అటు కుటుంబ సభ్యులు, ఇటు ఇరుగు పొరుగు నండి చిన్న ప్రశంస పొందినా ఆ రోజంతా ఆ ఇల్లాలికి దొరికే మానసిక స్వాంతన వెల కట్టగలమా.
ఒక్క ముగ్గు కొరకు ఎన్ని సార్లు ఒక ఇల్లాలు నడుమొంచి వంగి లేస్తుందో, పొట్టలో కొవ్వంతా కరిగేలా, ఎన్ని సార్లు వివిధ భంగిమల్లో ఆసనాలు వేస్తుందో, ఎన్ని విన్యాసాలు చేస్తుందో, ఎన్ని సార్లు జరిగిన పొరపాటును సరిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తుందో, ఎంత ఓపికను కూడగట్టుకుని పోటీలో గెలుస్తుందో చెప్పక్కర్లేదు. గిజిగాడి అల్లిక జిగిబిగి అన్నట్టు, అంతకన్నా గొప్ప అల్లికలు అల్లుతూ పక్కింటామె కన్నా పదిరెట్లు మిన్నగా ఉండాలని తపన పడడం మన వల్ల అవుతుందా పురుష పుంగవా. ఉన్న కొంచెం స్థలాన్ని తన ముగ్గుకి సరిపోయేలా అమర్చుకోవడం, చుక్కలు, గీతల్లో వైవిధ్యాన్ని చూపిస్తూ, వివిధ ఆకారాలు, జ్యామితీయ రేఖలు గీస్తూ గణితంలో, ఇంజినియరింగ్లో తనకెవరు సాటి అంటూ కొత్త పాఠాలు నేర్పడం, నేర్పడం ఎప్పుడైనా గమనించారా. అభినందించారా మీ ఇంటి ఆడపడుచుని. ఆ చల్లని వాతావరణంలో, లేదా ఆ వెచ్చటి వాతావరణంలో, లేదా ఆ వర్షపు చినుకుల్లో వణికి, ఎండి, తడిచి ఆ ఇల్లాలు అన్ని ఋతువులకి అలవాటు పడుతూ, ఎంత రాటు దేలుతుందో శాస్త్రానికి దొరకని శాస్త్రం అది. గంట కష్టపడి అప్పుడే పూర్తయిన ముగ్గు ఎవడో కావాలని తొక్కేసినా, చెరిపేసినా, వర్షపు చినుకులకి చెదిరిపోయినా, అస్సలు బెదిరిపోని గట్టి పిండాలు మన అమ్మలు, అమ్మాయిలు. అల్లరికో, ఆనందానికో చెరిపేసిన అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అలుగుళ్లు, అటకెకెక్కటాలు, అరచి గీపెట్టటాలు, ఆనక కలసిపోవటాలు. అబ్బో ఆ సోషల్ బాండింగే వేరులే. తనకొచ్చిన ముగ్గుల కళను లేదా ఆ గొప్ప శాస్త్రాన్ని తనతోనే అంతరించకుండా తన బిడ్డకు, బిడ్డల బిడ్డలకు తరాల కొద్దీ అందించగల గొప్ప గురుతుల్యులు మన ఇల్లాళ్లు. సృజనాత్మకతను పుస్తకాలు లేకుండా తరాలకొద్దీ పదిలపరిచే గొప్ప మేధావులు వీరు కారా. చెప్పుల్లేకుండా ఆ మట్టి పరిమళాన్ని కాళ్లార ఆస్వాదించడం (స్వచ్ఛమైన ఆవు పేడ, ఆ మట్టి నేల మీద అంతసేపు ఉండి మట్టి చికిత్స చేసుకోవడం, ఆరోగ్యకర బాక్టీరియాను పెంపొందించుకోవడం. ఇదేంటి అనుకుంటున్నారా. ముల్తానీ మట్టి పేరిట సబ్బులు, పొడులు, క్రిముల పేరిట ఒళ్ళంతా పట్టించి కోట్ల వ్యాపారం చేస్తున్నది మనమే. మడ్ బాత్ పేరిట మట్టి పూసుకునేది కూడా మనమే. వాస్తవానికి మన నేలమ్మ కి మనకి టచింగ్ పోగొట్టుకున్నాం, రోగాలను పెంచుకుంటున్నాం. భూ అయస్కాంత శక్తినో లేక ఇంకేదో ఎనర్జీ నో చెప్పులతో, షూ వేసో కోల్పోతున్న మాట వాస్తవం కాదా). అదే రంగవల్లిని తన చేతుల్లో, పాదాల్లో మైదాకు చిత్రాలతో ప్రతిఫలింపజేయడం. అబ్బో ఎంత అద్భుతమైన కళ అది. ముంగిట ముగ్గుల్లో ముద్దుగుమ్మలు తమ అందాన్ని ఇనుమడింప జేసుకోవడం కొరకు లంగా ఓణి లోనో, చక్కటి చీరలోనో ఒదిగి తమ సాంప్రదాయాన్ని,సంస్కృతిని పదిమందికి పదికాలాల పాటు అందించి పదిలపరచడం గొప్ప సంఘ సంస్కర్తలు కాదా మన ఆడోళ్లు. శారీరక, మానసిక, సామాజిక కోణాల్లో తనకు మించిన గొప్ప జ్ఞాని ఇంకెవ్వరు అంటూ ఆదర్శంగా నిలిచే ఆడపడుచు, ముగ్గులోకి హరిదాసు వచ్చినా, గంగిరెద్దు వచ్చినా ఇంకొకరు ఇంకొకరు వచ్చినా ఆ అద్భుత దృశ్యం కనులవిందుగా ఉంటుంది కదా. అలాంటి దృశ్యాలు ఎవరి పుణ్యం.
(డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ మరియు ఎండార్ఫిన్ ఫీల్ గుడ్ హార్మోన్ లు) కొరకు మన మానవ సమాజం పడే తిప్పలు తెలియంది కాదు, పడని తిప్పలు లేవు. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు, సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది అనే పాటలోని మాటలా ఇంటిల్లిపాది అలా ఇంటి ముందు రంగవల్లుల రంగస్థలంలో మునిగితేలితే అంతకు మించిన డోసే మున్నది అనుకోవాల్సిందే. చిట్ట చివరిగా నాలుగు ఆసనాల కొరకో,నాలుగు గుంజీల కొరకో, మైండ్ మేనేజ్మెంట్ కొరకో, శారీరక, మానసిక ఆనందం, ఆహ్లాదం ఉల్లాసం, ఉత్సాహం కొరకో, ఆరోగ్యం కోసం అరోమా, కలర్, వాటర్, మడ్, లైట్ థెరపీల కొరకో లక్షలు ఖర్చు పెట్టే బదులు ఇంటి ముందుకు వచ్చి నడుమొంచి నాలుగు గీతలు గీస్తే పోలే. ముగ్గుల్లో గీసిన రేఖలు మీ జీవనరేఖను సైతం గీయగలవు, నాది గ్యారెంటీ వేల ఏళ్ల చరిత్రే సాక్ష్యం. కళల కాణాచి అయిన ముగ్గుల సంస్కృతిని కాపాడుకుందాం, వాటి వెనుకున్న శాస్త్రీయతను గుర్తిద్దాం. ఇక ముందు ఈ కోణంలో ముగ్గులోకి దిగుదాం. ఇంకో నలుగురిని దింపుదాం ఏమంటారు, మహిళా శాస్త్రవేత్తలూ, చేయుతనిస్తారా పురుష పుంగవులూ.

0 Comments