Breaking News

Loading..

ఛత్తీస్‌గఢ్‌ - ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌.


● మృతుల్లో టాప్‌ కమాండర్‌ జయరామ్‌ అలియాస్‌ చలపతి.

● చంద్రబాబు పై అలిపిరి దాడి ఘటనలో సూత్రధారి, అతని పై కోటి రూపాయలు రివార్డు.

● ఇద్దరు జవాన్లకు గాయాలు.

● వివరాలు వెల్లడించిన గరియాబంద్‌ ఎస్పీ.

● నక్సలిజం అంతమవుతోందన్న అమిత్‌ షా.

ఛత్తీస్‌గఢ్‌, జనవరి 22, బిసిఎం10 న్యూస్.

ఛత్తీస్‌గఢ్‌ - ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశాలోని నౌపడా జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబాద్‌ జిల్లా మైనాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి పుల్హాడి ఘాట్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. రాష్ట్రంలో ఇద్దరు మహిళా మావోయిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపిన మరునాడే ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు చేపట్టిన జాయింట్‌ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాల్పులు కొనసాగు తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో సీనియర్‌ నక్సల్స్‌ కమాండర్‌ జయరామ్‌ అలియాస్‌ చలపతి చనిపోయాడని, అతని పై కోటి రూపాయల రివార్డు ఉన్నదని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. అదే విధంగా ఎన్‌కౌంటర్‌ పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందిస్తూ నక్సలిజం కొన ఊపిరితో ఉన్నదని అన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో రెండు రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌ దళం (సీఆర్‌పీఎఫ్‌) కూడా పాల్గొంది. సరిహద్దు ప్రాంతంలోని దట్టమైన అడవిలో నక్సల్స్‌ కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ దళం ఈ నెల 19న గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సోమవారం అడవిని జల్లెడ పడుతున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. వీరి మధ్య సుమారు 36 గంటల పాటు కాల్పులు జరగగా 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా, ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలకనేతలు మృతి చెందినట్టు ఎస్పీ తెలిపారు. అలాగే ఇద్దరు డీఆర్జీ జవాన్లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా రాయపూర్‌కి తరలించారు. ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని ఒడిశా నుయపాడ ఎస్పీ రాఘవేంద్ర, గుండాల, ఒడిశా డీఆర్‌జీ నక్సల్స్‌ ఆపరేషన్‌ ప్రత్యేక అధికారి అఖిలేశ్వర్‌ సింహం, కోబ్రా కమాండర్‌ డీఎస్‌ కథైత్‌తో పాటు మరికొంత మంది పోలీస్‌ ఉన్నతాధికారులు చెప్పారు. కాగా మృతుల్లో కోటి రూపాయల రివార్డు గల కేంద్ర కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఆంధ్ర - ఒడిశా బోర్డర్‌ కార్యదర్శి రామచంద్రారెడ్డి(60) అలియాస్‌ చలపతి, అలియాస్‌ జయరాంతో పాటు తెలంగాణలోని వరంగల్‌కు చెందిన ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్‌ అలియాస్‌ బాలకృష్ణ, అలియాస్‌ బాలన్న ఉన్నారు. ఏపి సీఎం చంద్రబాబునాయుడు పై గతంలో అలిపిరిలో జరిగిన దాడిలో చలపతి కీలక సూత్రధారి.

భారీ ఎన్‌కౌంటర్‌ పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ ‘నక్సలిజాన్ని అంతం చేసే విషయంలో చివరి దశకు చేరుకున్నాం. నక్సలిజానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టుల విముక్త భారత్‌ సాధనలో మన భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి’ అని తెలిపారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులను ఆయన అభినందిస్తూ ‘మావోయిస్టుల విముక్త భారత్‌ను సాధించాలన్న మన సంకల్పం, మన భద్రతా దళాల సంయుక్త చర్యల కారణంగా నక్సలిజం ఇవాళ తుది శ్వాస విడుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని తుడిచిపెడతామని గత ఏడాది జాతీయ మీడియాతో మాట్లాడుతూ అమిత్‌ షా చెప్పారు. ఒక్క 2024వ సంవత్సరంలోనే రాష్ట్రంలో 220 మంది మావోయిస్టులను మట్టుపెట్టామని ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రి విజరు శర్మ గత నెలలో తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ భద్రతా దళాల సంయుక్త చర్యల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసు వర్గాలు చెప్పాయి.

Post a Comment

0 Comments