భద్రాచలం నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కు భద్రాచలం నియోజకవర్గ తెలంగాణ జన సమితి కోఆర్డినేటర్ లు పూనెం ప్రదీప్ కుమార్, రేపాక రామారావు గుప్తా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాదులోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో ఎమ్మెల్సీ కోదండ రామ్ ను టి జె ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్ రావు ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందచేశారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీ తో మాట్లాడుతూ ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం లోని చర్లలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఏజెన్సీ లోని గిరిజన యువతకునాణ్యమైన విద్య అందుతుందని, అంతేకాకుండా వారికి ఆర్థిక భారం కూడా తగ్గుతుందని తెలిపారు. చర్ల మండలంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపినట్లయితే భద్రాచలం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీకి వివరించారు. అదేవిధంగా భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో టాయిలెట్లను, వాకింగ్ ట్రాక్ , లైటింగ్, వాల్ హైట్ పెంచే విధంగా ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ క్రీడా మైదానంలో ఎన్నో గిరిజన క్రీడా పోటీలు నిర్వహిస్తుంటారని, క్రీడల్లో పాల్గొనే విద్యార్థినీలు టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రతినిత్యం కొన్ని వందల మంది వాకింగ్ చేస్తుంటారని వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. చర్ల మండలంలోని గుత్తి కోయలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆ సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. ఈ విషయాలపై స్పందించిన ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమస్యలను వివరించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

0 Comments