Breaking News

Loading..

ఇంకా 110 కోట్ల మంది 'దుర్భర దారిద్య్రం'లోనే..!!

ఇంకా 110 కోట్ల మంది 'దుర్భర దారిద్య్రం'లోనే..!!


● యుద్ధాలు, దాడులు, ఘర్షణలు నెలకొన్న దేశాల్లోనే సగం మంది.

● భారత్లో అత్యధికం శాంతితోనే పేదరిక నిర్మూలన.

● ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడి.

హైదరాబాద్, అక్టోబర్ 18, బిసిఎం10 న్యూస్.

వీరిలో దాదాపు సగం మంది యుద్ధాలు, దాడులు, ఘర్షణలతో సతమతమవుతున్న దేశాల్లోనే ఉన్నారు. యుద్ధాలను ఎదుర్కొంటున్న దేశాలు బహుముఖ దారిద్య్రానికి సంబంధించిన అన్ని సూచికల్లోనూ అధిక స్థాయిల్లో లేమిని ఎదుర్కొంటున్నాయని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) తాజాగా ప్రచురించిన సూచీ పేర్కొంది. పోషకాహారం, అందుబాటులో విద్యుత్, నీరు, పారిశుధ్యం వంటి విషయాల్లో మరింత తీవ్రమైన అసమానతలు నెలకొన్నాయని పేర్కొంది. 112 దేశాల వ్యాప్తంగా, 630 కోట్ల మంది ప్రజల పై జరిగిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 110 కోట్ల మంది ప్రజలు అత్యంత దారుణమైన రీతిలో దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది. వీరిలో 45.5 కోట్ల మంది ప్రజలు ఘర్షణల నీడల్లో జీవిస్తున్నారని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ పేర్కొంది. ఇటీవలి సంవత్సరాల్లో ఘర్షణలు ఉధృతమయ్యాయి. ఎక్కడికక్కడ అనేక రెట్లు పెరిగిపోయాయి. దీంతో మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిల్లో లక్షలాది మంది నిర్వాసితులవుతున్నారు. ఫలితంగా వారి జీవితాలకు, జీవనోపాధులకు తీవ్ర స్థాయిల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయని యుఎన్డిపి నేత ఆచిమ్ స్టెయినర్ పేర్కొన్నారు. 18 ఏండ్లలోపు దాదాపు 58.4 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్నారని సూచి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గల పిల్లల్లో వీరి సంఖ్య 27.9 శాతంగా ఉంది. యువత సంఖ్య 13.5 శాతంగా ఉంది. యుద్ధాలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలో పిల్లల మరణాలు 8 శాతంగా ఉన్నాయి. అదే సమయంలో శాంతి నెలకొన్న దేశాల్లో పిల్లల మరణాలు 1.1 శాతంగా ఉంది. ప్రపంచంలోని నిరుపేదల్లో 83.2 శాతం మంది సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో, దక్షిణాసియా దేశాల్లో జీవిస్తున్నారని పేర్కొంది. ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ (ఓపీహెచ్ఐ) యుఎన్డిపి సంయుక్తంగా ఈ నివేదిక రూపొందించాయి. సరైన ఇళ్ళు లేకపోవడం, పారిశుధ్యం, విద్యుత్, వంట ఇంధనం, పోషకాహారం కొరత, స్కూళ్ళకు పిల్లలు హాజరయ్యే తీరును వివిధ స్థాయిల్లో అంచనా వేసి బహుముఖ దారిద్య్రాన్ని అంచనా వేశారు. ఆఫ్ఘనిస్తాన్పై వీరు కూలంకషంగా అధ్యయనం జరిపారు. దేశంలో దాదాపు మూడింట రెండు వంతుల మంది ప్రజలు గతేడాది నిరుపేదలుగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. 2016 నుండి 2023 మధ్య కాలంలో అదనంగా 53 లక్షల మంది పేదరికం బారిన పడ్డారు. ఘర్షణలతో నిత్యం సతమతమయ్యే దేశాల్లో పేదలు కనీస అవసరాల కోసం జరిపే పోరాటం మరింత కఠినంగా ఉంటోందని యూఎన్డీపీ ముఖ్య గణాంక అధికారి యాంచున్ ఝాంగ్ వ్యాఖ్యానించారు.

దుర్భర దారిద్య్రంతో జీవించే వారు భారత్లో అత్యధికంగా ఉన్నారు. 140 కోట్ల మంది జనాభాలో 23.4 కోట్ల మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో పాకిస్తాన్, ఇథియోపియా, నైజీరియా, కాంగోలు ఉన్నాయి. 110 కోట్ల మంది పేదల్లో దాదాపు సగం మంది ఈ ఐదు దేశాల్లోనే ఉన్నారు. దాడులు, ఘర్షణలు నెలకొన్న దేశాల్లో దారిద్య్ర నిర్మూలన చాలా మందకొడిగా ఉందని ఒపిహెచ్ఐ డెరెక్టర్ సబీనా అల్కిరే తెలిపారు. అందువల్ల శాశ్వత శాంతిని నెలకొల్పనిదే దారిద్య్ర నిర్మూలన సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments