Breaking News

Loading..

ఒకటో నెంబర్‌ హెచ్చరిక- Arun Sagar

  •  ఇదిగో ఈయన గారి గురించిఅరుణ్ సాగర్ 25th March, 2014న కళ్లకు కట్టినట్టు చూపించాడు.. 
  • హాట్స్ ఆఫ్ అరుణ్ సాగర్ నీ దూరదృష్టికి.


#Don't Skip, Must Read Article





డియర్‌ చే. మమ్మల్ని క్షమించు. ఓ అజ్ఞాని చేసిన అపచారానికి, దాన్ని ఆనాడే నిలదీయకుండా లైట్ తీసుకున్న మా అలసత్వాన్ని క్షమించు. నువ్వు నలుగురికీ కొత్తగా పరిచయమవుతావనీ నువ్వు కొన్ని కొత్త హృదయాలను వెలిగిస్తావని,నువ్వు కొన్ని కొత్త ఆవేశాలను రగిలిస్తావని ఆశతో ఆకాంక్షతో సహించాం. ఇప్పుడిక తాటతీస్తాం!



ఎన్ని మాటలు గురూ.? రెండున్నర గంటలపాటూ టేకులూ రీటేకులూ లేని నటనావైదుష్యం. యాడికెల్లొస్తారు గురూ. వీళ్లు మనల్ని ఏమనుకుంటారు. పాపం చిన్న జీవితం. బావి చుట్టూ గుండ్రంగా, రౌండుగా ఒక చక్రంలో చిక్కుకున్న ఆ ప్రదేశముందే అదేవారి ఆకాశం. ఆ పదడుగుల నీరే ఆవాసం. పైగా చేగువేరా బొమ్మొకొటి. ఎగిరితన్నేవాడు లేకపోతే సరి.



#ఒక పార్టీ దానికో విధానం. 

దానికో పుస్తకం. 

పర్యావరణం కోసం పాటు పడతాం. రాష్ట్ర ఆవిర్భావం తప్ప వేరే పండగలు జరుపుకోం. అందరూ మంచిగా ఉండేలా సమాజాన్ని మారుస్తాం. వైద్యం అందరికీ సమానంగా అందిస్తాం. మహిళలు నిర్భయంగా తిరిగేలా చూస్తాం. పర్యావరణ పరి రక్షణకు పాటుపడతాం. అయిందా?

ఇంకేమైనా ఉందా. ఉండదులే. చిన్న మెదడు తప్ప పెద్ద మెదడు ఉండే అవకాశమే లేని చోట ఇంతకంటే గొప్ప ఆశయాలు ఏముంటాయి. ఇవి తప్ప గొప్ప విధానాలు ఉంటాయనే ఆలోచన మాత్రం ఎలా వస్తుంది. చీకటి బుర్రలో ప్రమిద వెలగించాలన్నా కొంచెం ప్లేసుండాలి కదరా అన్నయా. పార్టీ విధానమంటే ఏం చేస్తామో చెప్పడం కాదురా బై ఎలా చేస్తామో చెప్పడం!



#ప్రశ్నించడానికే పుట్టాం. కానీ, ప్రశ్నించాల్సినవేమీ ప్రశ్నించం. కన్వీనియంట్‌గా ఉండే ప్రశ్నల్నే వేస్తాం. బై దివే మమ్మల్ని ప్రశ్నలు వేస్తే మాత్రం సహించం!



కానీ, గురూ పర్యావరణ పరిరక్షణ అంటే ఏమిటి? చీపురు పట్టుకుని రోడ్లు ఊడవడమూ, హుసేన్‌సాగర్‌ డ్రెడ్జింగ్‌కు బడ్జెట్‌లకై పోరాడటమా. లేక ప్లాస్టిక్‌ నిషేధమా? కొందరు సినిమా డైరెక్టర్లను వేదిక ఎక్కించి ఎర్త్‌ అవర్‌ పాటించడమా? వర్ధమాన దేశాల నీటినీ, గాలినీ, నేలనీ, ఆవరణాన్ని ధ్వంసం చేస్తున్న దోపిడీ రూపాలేంటో కప్పలకు ఎలా తెలు స్తుంది?

జెనీవాకు వియన్నాకు లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్లి నిరసన ప్రదర్శనలతో దేశం కాని దేశంలో ఎందుకు అరెస్టయి జీవితాలు త్యాగం చేసుకుంటారో వీళ్లకు ఎలా అర్థమవుతుంది. చే గువేరా బొమ్మ పెట్టుకున్నంత మాత్రానే అర్థమైపోతుందా. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడట మంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడటమని వీళ్లకు ఎవరు చెబుతారు.

పర్యావరణ రక్షణంట! పర్యావరణ రక్షణ!



మంచి సమాజం, అందరూ సమానం. ఎన్నెన్ని ఐడియల్స్‌ గురూ ఎంత వీజీ గురూ. పార్టీ విధానమంటే స్లోగన్‌ కాదురా నాయనా ఆచరణ అనీ దానికీ ఒక ప్రణాళిక, కార్యక్రమం ఉంటాయనీ ఎలా చెప్పాలితనికి. పైగా తిలక్‌ కవిత్వం ఎవడో రాసిస్తే చదివేసి, గద్దర్‌ పాట అర్థం తెలియకుండా పాడేసి!



ముందిది చెప్పు - ఈ దేశంలో పేదరికానికీ అసమానతలకూ అన్యాయాలకు కారణాలేవనుకుంటున్నావో చెప్పు. తెలంగాణ పోరాటం ఎందుకు జరిగిందనుకుంటున్నావో చెప్పు. అసలు నీకు పెద్ద మనుషుల ఒప్పందంలో ఏమేమున్నాయో తెలుసా. ముల్కీ అనే మాట విన్నావా. తొక్కలో డైలాగులు నాలుగు విసిరి ఎంటర్‌టైన్‌ చేసేస్తే నీ అజ్ఞానానికి మేకప్‌ వేసినట్టేనని భ్రమపడుతున్నావా! అంబానీల అడ్డగోలు దోపిడీకి అన్ని గేట్లూ ఎత్తేయడానికి సిద్ధపడ్డ వాడిని నెత్తిన పెట్టుకుని అందరూ సమానమయ్యే సమాజం గురించి విధాన ప్రకటన చేస్తున్నవే

- మా చెవిలో ఏమైనా కమలం పూవులు కనిపిస్తున్నాయా.



 సరే కానీ గురూ, ఇవన్నీ పక్కనపెట్టు నీ నుంచి ఇన్ని ప్రశ్నలకు సమాధానాలను ఆశించడం వెర్రివాళ్లు చేసే పనే. కానీ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. నీకు కుత్బుద్దీన్‌ అన్సారీ ఎవరో తెలుసా? ఫేస్‌ ఆఫ్‌ గుజరాత్‌ రాయిట్స్‌ను నువ్వు గుర్తు పట్టగలవా. గర్భిణుల కడుపులు చీల్చి, కుటుంబాలకు కుటుంబాలను ఇళ్లల్లో తలుపులు వేసి బంధించి సజీవ దహనాలు చేసి, వీధిలో, బడిలో, బేకరీలో కత్తులు, గొడ్డళ్లు, త్రిశూలాలు చేతబట్టి వెంటాడి వేటాడి నెత్తురు పారించిన రక్తపు వాసన నీ ముక్కుకు తెలుసా. మోడీ మీద నమ్మకం. తొక్కలోది.



వైద్యం అందరికీ సమానంగా! ఎక్కడి నుంచి వస్తుంది గురూ. నువు చాలా మంచాయన అని చెబుతున్న చంద్ర బాబుగానీ, ఎవరి తీర్థాన్నైతే నెత్తిన పోసుకుంటున్నావో ఆ మోడీ గానీ ఏం పీకారు. ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్ని నాశనం చేసి, నిధులివ్వక కార్పొరేట్‌ ఆసుపత్రుల బొక్కసాన్ని ప్రజాధనంతో నింపేస్తున్న దొంగ ఇన్సూరెన్స్‌ స్కీముల స్కాముల సాముల్ని నెత్తిన పెట్టుకుని నువు మాట్లాడే మాటలను ఎవరు నమ్ముతారు? పైగా స్కామ్‌స్టర్‌ని పార్టీ ఫైనాన్సియర్‌గా పెట్టుకుని తొక్కలో సుద్దులు చెబితే నమ్మడానికి జనం వెర్రి గొర్రెలనుకున్నావా.



 బాసూ నువ్వింత నాటకం ఆడకుంటే బాగుండేది. సామాన్యుడు, సామాన్యుడు అంటూ దొంగ జపం చేస్తూ ఇన్ని కోట్ల ఖర్చుతో హైటెక్‌ పార్టీ లాంఛ్‌ చేయకుంటే బాగుండేది. అనవసరంగా డబ్బులు వేస్ట్‌ చేశావు. సొమ్ము నీది కాదు కాబట్టి పెద్ద ఫరకేం పడదు. నువ్వు మాత్రం ఏం చేయగలవు. నీ డైరెక్టర్‌ ఫాల్టది. బహుశా మోడీగారు ఇలాగే కోరి ఉంటారు. ఈ నాటకం అంతా ఆడి సినిమాటిక్‌గా ఈ ట్విస్టు ఇవ్వమని చెప్పి ఉంటారు. పిచ్చి జనులు కాదు గురూ పచ్చి నాటకాలను కూడా కచ్చితంగా పసిగట్టగల చైతన్యశీలురు. నీ వినోదాత్మక ప్రసంగంలోనే కనిపెట్టారు. నీ ముందూ వెనుకా నిన్ను నడిపించే శక్తులెవరో, ఈ కార్పొరేట్‌ రాజకీయ క్రీడలో నీ స్పాన్సర్లెవరో జనం సులభంగా గ్రహించారు.



 చరిత్రలో ఇది మామూలే. పెట్టుబడి వేసే ఎత్తుగడల్లో భాగంగా చాలామంది శిఖండులు రకరకాల స్థలకాలాల్లో ఇలా అవతారాలెత్తి ఆపై పనికాగానే అలా సర్దుకుంటారు. ఇప్పుడు పెట్టుబడికి మోడీ కావాలి. అతని కోసం రకరకాల రూపాల్లో, పాత్రల్లో తెరమీదకు తోలుబొమ్మలు రావాలి. కాగల కార్యం తీర్చాలి. అలాంటి కేరక్టరే ఇది. కాకపోతే ఇది తెరమీది పాత్ర కాదు అంతే తేడా. నటనొక్కటే కామన్‌.



ఎంత మోసగాడివి గురూ. మోసగాడు సినిమాలో మీ అన్నయ్య నటించాడు. నువ్వేమో చే గువేరా బొమ్మలు పెట్టుకున్నావ్‌, శివసాగర్‌ కవిత్వం చదివావ్‌, తిలక్‌ని కోట్‌ చేశావ్‌, కొమురం పులి సినిమా టైటిల్‌ పెట్టుకున్నావ్‌. నీ గురించి ఊహించుకున్నదొకటి నువ్వు చేసిందొకటి. అంటే ఇంతవరకూ నువ్విచ్చింది ఓ బిల్డప్‌ అన్నట్టు. పెద్ద బిల్డప్‌. బకరా బనాలియా హం కో. బద్దలైపోయింది గురూ. నిజరూపం బట్టబయలైపోయింది గురూ. ఇదొక స్కెచ్‌. ఆ స్కెచ్‌లో నువ్వొక గీత. రెండు సినిమాలు ఫ్లాపయితే చెరిగిపోయే గీత. నీకు కూడా తెలిసిరావాలిలే. నీ సీను తరిగిన రోజున నీకేసి గల్లీలీడరు కూడా చూడడని తెలిసే - నీ రోజు నీకుంది అన్నయ్యా. లేదా మీ అన్నయ్య చూస్తే అర్థమవుద్ది.



 సంఘపరివార్‌ వాళ్లు ప్రతిదానికీ గొడవ చేస్తారు. పోస్టర్‌లో కృష్ణుడి కళ్లజోడు పెడితే గొడవ. రాముడి ఫొటో టీ షర్టు మీద వేస్తే గొడవ. హిందూ దేవతల బొమ్మ లేడీస్‌ హ్యాండ్‌ బ్యాగ్‌ మీద ఉంటే గొడవ. కానీ, మేం అలా కాదు. చే బొమ్మలు టీ షర్టుల మీద, బీరు మగ్గుల మీద, సిగార్‌ పెట్టెల మీద, ఆఖరికి హవాయి చెప్పుల మీద ఉన్నా మేం ఫీలవలేదు. అతన్ని ధరించడం ఒక ఫ్యాషనైనందుకు గర్వపడ్డాం. కానీ గురూ పొరపాటు చేశాం. ప్రతి గొట్టంగాడూ చే ఫొటో పెట్టుకోవడాన్ని చూసి ఊరుకుని పొరపాటు చేశాం. ఆనాడే నీకేం తెలుసని అడిగుంటే, నీ జ్ఞానమేంటో ప్రశ్నించి ఉంటే ఇప్పుడిలా మోసపోయే వాళ్లం కాదు. ఆత్మల మీద నమ్మకం లేదుగానీ, చే గువేరా బాధతో కుమిలిపోతున్నాడు. నినదించే గొంతులలో వినిపించే రూపం.

నిర్బంధకాండకు ఎదురొడ్డే గుండెలపై వికసించాల్సిన చిత్రం. ఇలా అమానవీయ, మతోన్మాద, జాత్యహంకార రక్కసికి మొక్కిన వాడి చేత చిక్కినందుకు అవమాన భారంతో కుంగిపోతున్నాడు.



 బెటర్‌ లేట్‌ దేన్‌ నెవర్‌. ఇప్పుడొక బహిరంగ హెచ్చరిక. ముందు నీ ఇంటి గోడ మీద చే బొమ్మ తీసేరు. నీ సినిమాల్లో సెట్‌ ప్రాపర్టీల్లో చే బొమ్మను ఎడిట్‌ చేసెరు. నువ్వు మోడీ తీర్థం తాగుతావో, చంద్రబాబు స్పాన్సర్డ్‌ పాట పాడుకుంటావో నీ ఇష్టం. బట్‌. చే కి దూరంగా ఉండు. నీకిక ఆ అర్హత ఏ మాత్రమూ లేదు. నీకే చెబుతుంది వినిపిస్తుందా?

Arun Sagar.T

I

Post a Comment

0 Comments