Breaking News

Loading..

రాజ్యాంగ రక్షకులు జాతి వ్యతిరేక ప్రసంగాల..!!



సెప్టెంబర్ 28, బిసిఎం10 న్యూస్.

రాష్ట్ర గవర్నర్లు రాజ్యాంగాన్ని తిరస్కరించే స్థితికి దేశం చేరుకోవడం అత్యంత తీవ్రమైన విషయం. భారతదేశ లౌకికవాదం యూరోపియన్‌ భావన అంటూ తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఒక బహిరంగ కార్యక్రమంలో చేసిన ప్రసంగం సంఘ్ పరివార్‌ పాలన దేశాన్ని ఎటువైపు నడిపిస్తున్నదో స్పష్టం చేస్తోంది. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన గవర్నర్‌ రాజ్యాంగాన్ని త్యజించిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగడం తగదు. కన్యాకుమారిలో హిందూ ధర్మ విద్యాపీఠ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జాతి వ్యతిరేక ప్రసంగం చేశారు. రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా నిర్వచించిన లౌకికతత్వాన్ని గవర్నర్‌ బహిరంగంగా ఖండించారు. 'భారతదేశ ప్రజలమైన మేము, ఈ దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి భారత పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రాన్ని, అంతస్తుల్లోను, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించు కోవడానికి మన రాజ్యాంగ పరిషత్తులో చర్చించి తీర్మానించి, చట్ట రూపంలో మాకు మేము సమర్పించుకుంటున్నాము' ఇది రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా పేర్కొనబడింది. ఇది దేశ ప్రజలందరి సమగ్రత, సోదరభావాన్ని పెంపొందించడానికి నిర్ణయించినది. ఆర్‌ఎన్‌ రవి, ఆయన నియమించిన సంఘ్ పరివార్‌ కనీసం ఈ ఉపోద్ఘాతం చదవాలి. 

సెక్యులరిజం అనేది ప్రజాస్వామ్యం యొక్క అత్యంత అందమైన భావన. వివిధ మతాలు, కుల సమూహాలు, వివిధ భాషలు మాట్లాడే, విభిన్న ఆచారాలు కలిగిన భారత దేశాన్ని ఇతర దేశాల నుండి వేరుగా ఉంచేది మన లౌకిక సంస్కృతే. 75 ఏళ్లుగా మనం కాపాడుకున్న లౌకికవాదం భారతీయ సంస్కృతి కాదన్న స్పందన గవర్నర్‌ వ్యక్తిగత అభిప్రాయమని చెప్పలేం. సంఘ్ పరివార్‌ ఒక పథకం ప్రకారం ముందుకు తెస్తున్న ప్రాజెక్ట్‌ ఇది. కొన్ని వర్గాలను మభ్యపెట్టడానికే లౌకికవాదాన్ని రాజ్యాంగంలో భాగం చేశారని గవర్నర్‌ చెప్పడాన్ని బట్టి విషయం మరింత స్పష్టమవుతున్నది. ఇక్కడ పుట్టి పెరిగిన వారందరూ భారతీయులేనని అంగీకరించే నిష్కాపట్యం లౌకికవాదంలోని ప్రధానాంశం. మతంతో సంబంధం లేకుండా మనమంతా మనుషులమనే ఇంగితజ్ఞానంతో ప్రతి భారతీయుడు మార్గనిర్దేశం చేయాలని రాజ్యాంగం నొక్కి చెబుతోంది. అందరికీ న్యాయం, సమానత్వం రావాలి, కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో నడిచే ఆర్‌ఎన్‌ రవి అలా ఆలోచించలేదు. అత్యంత క్రూరమైన ఫాసిస్టు అడాల్ఫ్‌ హిట్లర్‌ ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందిన ఆర్‌ఎస్‌ఎస్‌ కు సెక్యులరిజం అనే మాటను వినడం కష్టంగానే వుంటుంది. హిట్లర్‌ ఎదుగుదల అంతా కమ్యూనిజం వ్యతిరేకత, యూదు వ్యతిరేకతతోను, జర్మన్‌ జాతీయవాదంతోనూ నిండిపోయింది. భారతదేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఇదేవిధంగా పనిచేస్తుంది. సంఘ్ పరివారీయులు మాత్రమే దేశభక్తులని, హిందువులు కానివారు భారతీయులు కారని వారి ప్రచారం. బిజెపి పదేళ్లుగా అధికారంలో ఉంది, అంతేగాక ఈ ఆలోచనకు ఆమోదం పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో ముఖ్యమైనది రాజ్యాంగ సంస్థలన్నింటిని ఆర్‌ఎస్‌ఎస్‌ అధీనంలోకి తీసుకురావడం. ఇందులో భాగంగానే సంఘ్ పరివార్‌ ప్రయోజనాలకు అనుగుణంగా కొన్ని కోర్టు తీర్పులు వెలువడుతున్నాయి. మొత్తం రాష్ట్రాల గవర్నర్లు ఆర్‌ఎస్‌ఎస్‌ కీలుబొమ్మలు. ప్రస్తుత రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా మనుస్మృతి ఆధారంగా భారత దేశాన్ని మత రాజ్యంగా మార్చడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. సంఘ్ కార్యకర్త అయిన నరేంద్ర మోడీని ఉపయోగించి అత్యంత వేగంగా ప్రతి ఎత్తుగడ వేస్తున్నది. బిజెపి ప్రభావం లేని రాష్ట్రాల్లో వీలైనంత వరకు సంఘ్ పరివార్‌ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి గవర్నర్లను సాధనాలుగా ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే కేరళలోని యూనివర్సిటీలను కబ్జా చేసేందుకు గవర్నర్‌ను వినియోగించు కుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్‌ ఏకంగా రాజ్యాంగాన్నే తిరస్కరించారు. అయితే రాజ్యాంగం చెల్లదని రేపు స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోడీ పరిపాలన ఆ దిశగానే సాగుతోంది. దీనికి వ్యతిరేకంగా భారత ప్రజలు ఏకతాటి పై నిలవకపోతే మన దేశం పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తరహాలో మతతత్వ రాజ్యంగా మారిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

Post a Comment

0 Comments