Breaking News

Loading..

కుర్షిద్ అహ్మద్ కి రాష్ట్రస్థాయి ఉత్తమ లెక్చరర్ అవార్డు..

                  


బిసీఎం10 న్యూస్ ఆగస్టు 31  భద్రాచలం : భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ అధ్యాపకునిగా పనిచేసి ఇటీవల మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీ అయిన కుర్షిద్ అహ్మద్ రాష్ట్రస్థాయి ఉత్తమ లెక్చరర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనకు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. సెప్టెంబర్ 5న జరగనున్న గురుపూజోత్సవ వేడుకలో హైదరాబాదులో ఆయన అవార్డు స్వీకరించనున్నారు. కుర్షిద్ అహ్మద్ ది పాల్వంచ పట్టణం. వీరి తల్లిదండ్రులు అబ్దుల్ రహీం, ఖాసింబీ. ఇంటర్ వరకు చదివి 1996లో కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. 2000 సంవత్సరంలో రికార్డ్ అసిస్టెంట్ గా టేకులపల్లిలో పనిచేశారు. సీనియర్ అసిస్టెంట్ గా ములకలపల్లి కళాశాలలో పనిచేశారు.2014 నుంచి 2024 వరకు భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా విధులు నిర్వహించారు. 

 ఇటీవల జరిగిన జనరల్ బదిలీల్లో మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లారు. కుర్షిద్ అహ్మద్ కు చక్కని పేరు ఉంది. విద్యార్థులకు చదువు నేర్పడంలో ఆయన దిట్ట. తాను పనిచేసిన కళాశాలలో అత్యున్నత విద్యా ప్రమాణాలను నెలకొల్పారు. నూటికి నూరు శాతం ఫలితాలను సాధించారు. చక్కని విద్యాబాలసం చేస్తూ మరోవైపు సాంఘిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. జన్మభూమి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించిన నేపథ్యంలో 2001 లోనే ఆనాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ గిరిధర్ చేతుల మీదగా ఉత్తమ సేవా పథకం అందుకున్నారు. హరితహారం,ఓటర్ నమోదు కార్యక్రమాల్లో తనదైన శైలిలో సేవలందించారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి బాలబాలికల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారు. 2020లో భద్రాచలం రోటరీ క్లబ్ ఉత్తమ అధ్యాపక అవార్డు ఇచ్చి సత్కరించింది.2022లో ఆచార్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఉత్తమ లెక్చరర్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ప్రభుత్వంచే జిల్లా ఉత్తమ అధ్యాపక అవార్డును కూడా తీసుకున్నారు.కుర్షిద్ అహ్మద్ అందించిన సేవలకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ లెక్చరర్ అవార్డుకు ఎంపిక చేయటం విశేషం. కుర్షీద్ అహ్మద్ కు అవార్డు రావడం పట్ల భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల చరిత్ర అధ్యాపకులు తోటమళ్ళ బాలయోగి ప్రత్యేక ప్రశంసలు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు.


Post a Comment

0 Comments