బీసీఎం10 న్యూస్ సెప్టెంబర్ 6 భద్రాచలం : భద్రాచలం డివిజన్ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తొలి అధ్యక్షుడు అమరజీవి కామ్రేడ్ టి.వి.ఆర్.చంద్రం 20వ వర్థంతి సభను భద్రాచలంలో సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. చర్ల రోడ్డులోని కేకే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వర్ రావు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ మరో సభ్యుడు, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు, సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేశ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు తదితరులు హాజరవుతారని తెలిపారు. భద్రాచలం డివిజన్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ చరిత్రపై టీవీఆర్ చంద్రం రాసిన డాక్యుమెంట్లు, టి వి ఆర్ చంద్రంతో అనుబంధం కలిగి ఉన్న పలువురు నాయకులు రాసిన వ్యాసాలతో కూడిన 'ఎగరేసిన ఎర్రని జెండా' పుస్తకాన్ని ఈ సభలో ఆవిష్కరించనున్నారు. 1931లో కూనవరంలో జన్మించిన టి.వి.ఆర్ చంద్రం తొలినాళ్లలోనే కమ్యూనిస్టు భావజాలానికి ప్రభావితులయ్యారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమయంలో కూనవరం గ్రామం ఎదురొడ్డున ఉన్న రుద్రంకోట తదితర ప్రాంతాలకు దళాలు వచ్చిన సమయంలో తగిన సహాయ సహకారాలు అందించారు. భద్రాచలం డివిజన్లో కమ్యూనిస్టు పార్టీ తొలి శాఖ కూనవరంలో ఏర్పడింది. ఆ శాఖకు కార్యదర్శిగా టీవీఆర్ చంద్రం పనిచేశారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిగా, పార్టీ చీలిక అనంతరం మార్క్సిస్టు పార్టీకి డివిజన్ కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, పేద వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. 60 నుంచి 70 వేల ఎకరాల భూములకు తాత్కాలిక పట్టాలు అప్పట్లో ఇప్పించేందుకు కృషి చేశారు. 1965-66 లో 16 నెలలు డిటెన్యూ గా జైలు జీవితం గడిపారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలంతా అరెస్టు అయిన సందర్భంలో తాను అజ్ఞాతవాసంలో ఉంటూనే సిపిఎం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నెరవేర్చారు. ఖమ్మం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా 1970 నుంచి ఆరేళ్ల పాటు ప్రజలకు సేవలందించారు. వ్యవసాయ కార్మిక సంఘంలో కీలక పాత్ర పోషించిన చంద్రం.. విజయవాడ రాష్ట్ర కేంద్రం నుంచి సంఘానికి అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఆల్ ఇండియా కిసాన్ సభ (AIKS) జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. 1981లో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘానికి తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలవల్ల పార్టీ నుంచి విరమణ పొంది తిరిగి భద్రాచలం వచ్చారు. జీవితాంతం సిపిఎం అభిమానిగానే కొనసాగారు. అత్యంత సాధారణ, నిరాడంబరం జీవితం గడిపిన టీవీఆర్ చంద్రం తన ఉద్యమ జీవితంలో, అనంతర కాలంలో ఒక్క అవినీతి మరక కూడా అంటనీయలేదు. అనారోగ్యంతో 2006 సెప్టెంబర్ 7వ తేదీన చంద్రం గారు కన్నుమూశారు. ఇప్పటికీ రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో 20వ వర్ధంతి సభను సెప్టెంబర్ 10వ తేదీన భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నారు. టీవీఆర్ చంద్రం అభిమానులు, ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై సభను జయప్రదం చేయవలసిందిగా టివిఆర్ చంద్రం కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

0 Comments