హైదరాబాద్, జూన్ 13, బిసిఎం10 న్యూస్.
ఏదో అలజడి ఉండింది, ఆశాభావం ఉండింది. అదీ కాకపోతే ఎలాగైనా ముందుకు పోవాలనే తెగింపు. శాసనసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోని ప్రస్తుత సంధి దశ ఏదో అవాస్తవికంగా గోచరిస్తున్నది. ఒక రాజకీయ శక్తిగా బిజెపి అజేయమైందని, అంతకన్నా ముఖ్యంగా దాని స్థానం మరెవరూ తీసుకోలేరని ఒక కథనాన్ని వ్యాపింపచేయడంలో బిజెపి, ఆరెస్సెస్‌లు నిమగ్నమై ఉన్నాయి. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని ఎక్కడకు చేరుస్తున్నది? కారల్ మార్క్స్ 1852 నాటి వ్యాసం 'లూయీ బోనపార్టీ 18వ బ్రూమియర్' లో వెలిబుచ్చిన ఒక అభిప్రాయం ప్రసిద్ధమైంది. చరిత్ర అనేది నిజమైన ప్రపంచ పరిస్థితుల వల్ల రూపుదాల్చుతుంది కాని, మనుషుల ఊహలనుబట్టి కాదని ఆయనంటారు. 'మనుషులు తమ చరిత్రను నిర్మిస్తారు. అయితే వారికి నచ్చినట్టుగా ఆ పని చేయలేరు. తాము ఎంచుకున్న పరిస్థితుల ప్రకారం కూడా వారు ఆ పని చేయజాలరు. తమకు ప్రత్యక్షంగా ఎదురైన, తమకు గతం అప్పగించిన దాని నుంచి సంక్రమించిన పరిస్థితులలోనే చేయవలసి వుంటుంది'.
● పరీక్షల మోసం - బొద్దింకల ఆవిర్భావం.
చెప్పిన సందర్భం వేరైనప్పటికి ప్రస్తుత సంధి దశను వర్ణించడానికి మార్క్స్ అభిప్రాయం చాలా చక్కగా సరిపోతుంది. విమర్శ సంగతి అటుంచి కనీసం ఎలాంటి ప్రశ్న వేసినా జాతి వ్యతిరేకమని భావించే వాతావరణంలో గత పదిహేను రోజులుగా అంతర్జాలంలో జరుగుతున్న పరిణామం ఏమాత్రం ఊహకందేది కాదు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జరిగిన ఒక ప్రయత్నాన్ని తోసిపుచ్చిన ఒక చెదరుమదురు తిరస్కారం. ఆ పని చేసిన వాళ్లను బొద్దింకలుగా, పరాన్న జీవులుగా వర్ణించడం ఎక్కడో చాచి కొట్టింది. పూర్తి ప్రాణాలతో ఉన్న మనుషులు అందులోనూ యువత తమను తాము బొద్దింకలుగా అభివర్ణించుకోవడం, దానికి ముందు వినిపించిన బాధ్యతా రహిత వ్యాఖ్య లాగే చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. కాని లోతుగా పరిశీలిస్తే అందులో చాలా అర్థం దాగి ఉందని తెలుస్తుంది. బొద్దింకల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే అవి అత్యంత ప్రతికూల పరిస్థితులలో కూడా తట్టుకుని దీర్ఘకాలం జీవించగలవని అర్థమవుతుంది. ప్రమాదకరమైన నిశ్శబ్దాన్ని, నిర్లక్ష్యాన్ని అవి ఛేదించడానికి ప్రయత్నిస్తుంటాయి. యువత నుంచి ఇలాంటి విపరీతమైన స్పందన రావడానికి ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న పరిస్థితులే కారణమని గ్రహించడానికి పెద్ద రాకెట్ శాస్త్రమేదీ అక్కర్లేదు. జాతీయ పరీక్షా కేంద్రం (ఎన్.టి.ఎ) నిర్వహించిన పరీక్షలన్నీ దారి తప్పిపోయాయి. ఇంకా చెప్పాలంటే అవన్నీ మోసాల పాలయ్యాయి, ఫలితంగా అవన్నీ రద్దయి పోయాయి చెల్లకుండా పోయాయి అనిశ్చితిలో పడ్డాయి. ఇందులో నీట్-యుజి, సి.బి.ఎస్.ఇ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ పద్ధతిలో జరిగినవి ఉన్నాయి. ఇప్పుడు ఐఐటి లకు జెఇఇ కూడా వచ్చి చేరింది, 2026లో ఇది పరాకాష్టకు చేరింది. ఈ మొత్తం వ్యవహారంలో మరీ చాలా దారుణమైన అంశమేమంటే మానవవనరుల మంత్రిత్వశాఖకు, ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రభుత్వానికి జవాబుదారి తనం బొత్తిగా లేకుండా పోవడం. ప్రజాస్వామ్యం పేరు చెప్పుకునే ప్రభుత్వం ఏదైనా సరే కనీసం బాధ్యతాయుతంగా స్పందించి ఉండేది. కానీ హతవిధీ..!! ఎలాంటి ప్రతి విమర్శకూ అవకాశమే లేని, ఆలోచనకే తావివ్వని ప్రస్తుత వాతావరణంలో మనకు ఇసుకలో తలదూర్చే ఉష్ట్రపక్షులు మాత్రమే ఉన్నాయి. ఫాసిస్టు తరహా జంతుజాలం పెరగడానికిది బాగా అనువైన వాతావరణం.
● డిజిటల్ రంగస్థలంలో ఇలా ఎందుకు జరుగుతుంది.??
కనీసంగా జరగాల్సింది హెచ్.ఆర్.డి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం. ఎన్నికైన ఒక ప్రభుత్వం పై యువత విశ్వాసం పునరుద్ధరించ బడాలంటే అది తప్పనిసరి. అయితే ఇది కేవలం 2026 పరీక్షలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. చాలా సంవత్సరాలుగా ఎన్.టి.ఎ జరుపుతూ వస్తున్న 70కి పైగా పరీక్షల పరిస్థితి అనుమానస్పదంగా మారిపోయింది. అందువల్ల తీవ్రమైన చర్య ఏదో తప్పక జరగాలి. యువజనుల సమిష్టి బృందాలకు ప్రతీకగా మారిన బొద్దింకలు యుద్ధానికి దిగాయి. వెనక్క తిరిగి చూస్తే ఇది జరగవలసి ఉండిందే. నిరీక్షణలో ఉన్నదే. ఈ వైఫల్యం మరీ ముఖ్యంగా జవాబుదారీతనం అన్నది వ్యంగ్యం కావడం ఏదో ఒక విధమైన తిరుగుబాటుకు దారితీసి ఉండేదే. ఈ రోజున యువజనులు దద్దమ్మలు కాదు. డిజిటల్ ప్రపంచంలో ప్రతిభ చూపగలవారే. కనుక వారి నిరసనకు అంతర్జాలమే రంగస్థలం కావడం తథ్యం. కాక్రోచ్ జనతా పార్టీ (సి.జె.పి)కి చెందిన బొద్దింకలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండుతోనే సరిపెట్టారు. ఇంకా వ్యవస్థాగతమైన, సంస్థాపరమైన ప్రశ్నలు ముందుకు తీసుకురాలేదు. ఇండియా వంటి అతి విశాలమైన విభిన్నతలు గల దేశంలో ప్రవేశ పరీక్షలను ఒకే చోట కేంద్రీకరించి చివరకు వాటి భవిష్యత్తును అక్కడే నిర్ణయించాలనే ప్రయత్నం విఫలం కావడం అనివార్యం. అంతేగాక ఆరెస్సెస్ ప్రేరిత బాధ్యుల కోసం కీలక స్థానాలు కట్టబెట్టేందుకు పాకులాడటం బిజెపికి అలవాటైన జబ్బు. ఇందుకోసం అవసరమైతే ప్రతిభావంతులను బలిచేయడానికి కూడా అది వెనకాడదు గనక సమస్య మరింత జటిలమవుతుంది. అలా కాకపోయినట్టయితే ఈ పరీక్షా పత్రాలను భారత వైమానిక దళం విమానాలలో తరలించడం, ప్రధానమంత్రి వ్యక్తిగతంగా పర్యవేక్షించడం వంటి పరిష్కారాలతో ఈ సమస్యను ఎదుర్కోవాలని ఎవరనుకోగలరు? ఒకవేళ మానవాతీత మూర్తులైన వారు అలాంటి మహాద్భుత శక్తి ప్రదర్శించగలరని భావించినప్పటికి వారి నుంచి అలాంటివి కోరడం మరీ అతిగా ఉంటుంది. ప్రైవేటు విద్యా మాఫియాలు ప్రభుత్వం తరపున సంక్లిష్టమైన పరీక్షలు సక్రమంగా నిర్వహించగలవని గట్టిగా నమ్మడమే ఒక విడ్డూరం. లాభార్జనా కాంక్షతో విద్యార్థుల భవిష్యత్తును విస్మరించడమనేది అలా ఉంచినా ఆదిలోనే బెడిసికొట్టిన ప్రక్రియ అది.
● అందరూ అదే బాటలో..!!
ప్రభుత్వ సంస్థలు, అక్కడి విద్య అన్న వాటికి విలువ కట్టే ఈ క్రమం జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధానమూల సూత్రాలకే విరుద్ధం అన్నది కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశం. మొత్తం మీద చెప్పాలంటే ఉద్యోగం వైట్ కాలర్ పని అయినా, తక్కువ జీతాల గిగ్ వర్కర్లయినా, ఏదోలా ఈడ్చుకొచ్చే అసంఘటిత అనియత కార్మికులైనా వీధుల్లోకి రావలసిన పరిస్థితి కల్పిస్తున్నది. ఇప్పుడు బొద్దింకలకు జరుగుతున్నదీ, ఇదివరలో నోయిడా, మనేసర్, ఉత్తరాఖండ్‌లో కార్మికుల విషయంలో జరిగిందీ అదే. నిజానికి అవేవీ సంప్రదాయకంగా కార్మికోద్యమ కేంద్రాలుగా ఉన్నవి కావు, అయినా ఈ పరస్పర సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం యువతరం ఆగ్రహంతో రగిలిపోతున్నది. న్యాయ వ్యవస్థ కొన్ని వర్గాలలోని దళారులను గురించి, ఎన్నికల కమిషన్ల నిర్వహణ గురించి కూడా సి.జె.పి ప్రస్తావించింది. పేరుకుపోయిన నిరాశలు, నిస్పహలను ఒక విశ్వసనీయమైన గౌరవప్రదమైన మార్గంలో వెల్లడించి పరిస్థితిని మార్చే అవకాశాలేమీ కనిపించనప్పుడు ఇది అనివార్యంగా జరిగేదే. ఆ కోణంలో చూసినప్పుడు సిజెఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య ఒక ట్రిగ్గర్ లాగా పని చేయడం కేవలం యాదృచ్ఛికంగా జరిగిందను కోవడానికి లేదు. సుప్రీం కోర్టు ఓటర్ల రాజ్యాంగ హక్కుల కన్నా ఎన్నికల సంఘం అధికారాల గురించే ఎక్కువగా ఆరాటపడుతున్నది. ప్రస్తుత సంధి దశ పై చాలా నిరుత్సాహకరమైన వ్యాఖ్యానం లాంటి పరిణామమిది. అందువల్ల మన సమకాలీన సన్నివేశంలో బొద్దింకలు, ఉష్ట్రపక్షులూ మరింత ఎక్కువగా సందర్శనలు జరపడం కొనసాగుతుంది. ఈ సందర్భానుసారంగా చూసినప్పుడే ప్రజాస్వామ్యం పురోగమనం కాంక్షించే రాజకీయ శక్తులు తమ స్థానమేమిటో నిర్ణయించుకోవలసి ఉంటుంది. తద్వారా తమ కాలపు చరిత్రలో భాగస్వాములు కావలసి ఉంటుంది.

0 Comments