Breaking News

Loading..

కుటుంబ వ్యవస్థ కూలిపోతే 'మనిషి అన్నవాడు మిగులుతాడా..??'


ఖమ్మం, మే 26, బిసిఎం10 న్యూస్.

ఈ ప్రపంచంలో మనిషికి మొదటి దేవాలయం కుటుంబం, మొదటి గురువు తల్లి, మొదటి భరోసా తండ్రి, మొదటి స్నేహితుడు అన్న లేదా తమ్ముడు, మొదటి ప్రేమ అక్క లేదా చెల్లెలు. కానీ ఈరోజు అదే కుటుంబం నెమ్మదిగా కూలిపోతుంటే మనిషి బతికున్నా జీవితం చనిపోతుంది. ఎందుకో తెలియదు, ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ ఇంట్లో నవ్వులు తగ్గిపోయాయి, మాటలు తగ్గిపోయాయి, మనసులు దూరమయ్యాయి.

ఒకప్పుడు తల్లి చేతి అన్నం కోసం పిల్లలు ఎదురు చూసేవారు. ఇప్పుడు అదే తల్లి కొడుకుతో రెండు నిమిషాలు మాట్లాడాలన్నా భయపడుతోంది. 'ఏం మాట్లాడితే ఏం కోపపడతాడో' అని తల్లి గుండె వణుకుతోంది. ఒకప్పుడు తండ్రి ఇంటికి వస్తే పిల్లలు పరుగెత్తి కౌగిలించుకునేవారు, ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నా పిల్లలు ఫోన్లలోనే బతుకుతున్నారు. ఆ తండ్రి కళ్లలో ఒకే ప్రశ్న 'నేను డబ్బు సంపాదించి, ప్రేమని కోల్పోయానా..??' నేను వీళ్ళకి కేవలం ఎటిఎం మిషన్ నా..?? అని.

అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చిన రోజులు పోయాయి, ఇప్పుడు ఒక గజం భూమి కోసం రక్తాలు కారేలా తన్నుకు చస్తున్నారు. అక్కాచెల్లెళ్లు ఒకరి బాధకి ఒకరు కన్నీళ్లు పెట్టుకునే రోజులు మాయమైపోయాయి, ఇప్పుడు పండుగ రోజున కూడా ఫోన్ చేయడానికి సమయం లేదు.

భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాల్సిన చోట అహంకారం రాజ్యమేలుతుంది. 'క్షమించు' అనే ఒక్క మాట చనిపోవడంతో, ఎన్నో కుటుంబాలు శ్మశానాలుగా మారుతున్నాయి.

ఎంత దారుణమంటే కన్న తల్లి కూడా బిడ్డల పై కక్ష పెంచుకుంటోంది. కన్న కొడుకే తండ్రి పై చేయి చేసుకునే స్థితికి చేరుకున్నాడు. ఈ దృశ్యాలు చూస్తుంటే, మనిషి ఎదిగాడా లేక మానవత్వం చనిపోయిందా అనిపిస్తోంది. ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ ఆప్యాయత లేదు. డైనింగ్ టేబుల్ ఉంది, కానీ కలిసి భోజనం చేసే మనుషులు లేరు, ఉన్నా వారికి ఆ మనసు లేదు. వేల రూపాయల ఫోన్లు ఉన్నాయి, కానీ 'అమ్మా ఎలా ఉన్నావు..??' అని అడిగే ప్రేమ లేదు.

ఈ రోజున మనం మన పిల్లలకు అన్నీ నేర్పిస్తున్నాం, కానీ 'కుటుంబం విలువ' మాత్రం నేర్పించడం మరిచిపోయాం. ర్యాంకులు తెప్పిస్తున్నాం, కానీ రక్త సంబంధాలు నిలబెట్టుకొనే సిలబస్ నేర్పించడం మర్చిపోతున్నాం. డబ్బు సంపాదించడం నేర్పించాం, కానీ మనుషుల మనసులని ఎలా గెలుచుకోవాలో నేర్పించలేదు. ఇప్పుడు పెద్ద ఇళ్లులు ఉన్నాయి, కానీ అందులో మనుషులు ఉండరు. ఖరీదైన మంచాలు ఉంటాయి, కానీ ప్రశాంతమైన నిద్ర ఉండదు. పుట్టినరోజుకి వందల మెసేజ్లు వస్తాయి, కానీ కళ్లలోకి చూసి ఆశీర్వదించే తల్లిదండ్రులు ఉండరు. ఆ రోజు మనిషి ఏడుస్తాడు, కానీ ఆ కన్నీళ్లు తుడిచే చేయి ఉండదు. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు, మనసులు కలిసే పవిత్ర స్థలం. అది కూలిపోతే దేశం కాదు, ప్రపంచమే కూలిపోతుంది.

అందుకే ఈరోజు నుంచైనా తల్లిదండ్రులతో ఐదు నిమిషాలు ప్రేమగా మాట్లాడండి, అన్నదమ్ములను కౌగిలించుకోండి, అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించండి, భార్యాభర్తలు గెలవడానికి కాదు కలిసి జీవించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చనిపోయాక శవపేటికను మోసేవాళ్లు చాలామంది దొరుకుతారు, కానీ బతికున్నప్పుడు మనసును మోసేవాళ్లు కుటుంబ సభ్యులే. 'కుటుంబాన్ని కాపాడుకుందాం, మనసులను బ్రతికిద్దాం' లేకపోతే రేపటి తరానికి ఇళ్లు మిగులుతాయి కానీ 'ఇంటివాళ్లు, మిగలరు. కుటుంబం అనేది పూలదండలాంటిది, ఏ పువ్వు కా పువ్వు ని దండనుండి వేరు చేసి ఆ దండకున్న విలువని, గౌరవాన్ని తీయకండి, దానికున్న అందాన్ని చెడగొట్టకండి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు లేకపోతే ఆ కుటుంబానికి విలువ ఉండదు. దయచేసి  చిన్న చిన్న ఇగోలకి, గొడవలకి పోయి బంధాలను తెంచుకోకండి, ఏకాకిగా మిగిలి పోకండి ప్లీజ్.

Post a Comment

0 Comments