ఖమ్మం, అక్టోబర్ 29, బిసిఎం10 న్యూస్.
దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎలాంటి అమానుష నేరాలు చోటుచేసుకున్న వాటి మూలాలు మద్యం మహమ్మారి స్వైర విహారంలో ఉంటున్నాయి. తాగిన మత్తులో ఒళ్ళు పెయ్యి తెలియకుండా ప్రవర్తిస్తున్న వారి ఎన్నో కుటుంబాలను కష్టాల కాష్థాల్లోకి నెట్టేస్తున్నాయి. మొన్న ఫిబ్రవరిలో తెలంగాణలోని చౌటుప్పల్ మండలంలో పీకల్దాకా మందు కొట్టిన ఒకతను 14 ఏళ్ల కొడుకును పిడుగులు బుద్ధి చంపాడు. అదే మైకంలో జోగాడుతూ కిందటి నెలలో నేరేడుమెట్లో అమ్మానాన్నలను హతమార్చాడొక ప్రబుద్ధుడు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కాకినాడ జిల్లాలో అమ్మమ్మను చంపేశాడొక మనవడు. మద్యం మానేయమని చెప్పినందుకు కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో బీరు సీసాతో కన్నతండ్రి మెడ పై పొడిచేశాడు ఇంకొకడు. ఇలాంటి కర్కోటకులకు తోడు పూటుగా తాగి మహిళల పై ఆకృత్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులు కోకొల్లలు.
ఇక అడుగు తీసి అడుగు వేయలేనంతగా మందు పట్టించిన తర్వాత వాహనాలతో రోడ్ ఎక్కుతున్నారు దారుణ దుర్ఘటనలు ఎన్నింటికో కారణాలు అవుతున్నారు. ఇంత సామాజిక విధ్వంసం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తూ ఆ నెత్తుటికూటికి లొట్టలేస్తుండటమే ఘోరం. ఈ విధానం సంక్షేమ రాజ్య భావనకు పూర్తిగా విరుద్ధం. పసిపిల్లలతో సహా 19 మంది నిలువునా సజీవ దహనమైన కర్నూల్ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం ఏమిటి..?? అర్ధరాత్రి వేళ మద్యం మత్తులో తూగుతూ బండి నడిపిన ఒక కుర్రాడు హైవే పై డివైడర్ కు ఢీ కొట్టి చనిపోయాడు, అలా నడిరోడ్డు పై పడిపోయిన ద్విచక్ర వాహనం చివరికి ఎంతో మంది జీవిత స్వప్నాలను కాల్చి బూడిద చేసింది. రెండేళ్ల క్రితం మహారాష్ట్రలోని బుల్దానాలో ఇలాగే ఓ బస్సు దగ్ధమై పాతిక మంది ప్రయాణికులు మరణించారు, ఆ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు విచారణలో బయటపడింది. అలాంటివే అసేతు హిమాచలం ఎన్నో నరమేధాలు, వాటన్నింటికి ప్రాథమికంగా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలే కదా. ఎందుకంటే మత్తు పదార్థాల వాడకాన్ని పూర్తిగా నిరుత్సాహ పరుస్తూ ఆరోగ్య భారతాన్ని నిర్మించడం ప్రభుత్వ కర్తవ్యం అన్న రాజ్యాంగ నిర్దేశాన్ని అవి కాలదన్నుతున్నాయి. రోడ్ల పక్కనే మందు షాపుల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం, అంతెేకాకుండా ఊరూరా బెల్టుషాపులకు అనుమతులిచ్చి ఊర్లలో జనాలను తాగుబోతులను చేసి పచ్చటి కుటుంబాలు ఆగమైపోతున్నాయి. నేడు యువత, పెద్దలు గుట్కాలు, తంబాకు మొదలగు వాటికి అలవాటు పడి తమ తమ జీవితాలను ఆగం చేసుకోవటమే కాక మద్యానికి బానిసలై పల్లెల్లో పచ్చని బ్రతుకులు ఛిధ్రమై పోతున్నాయి వీటన్నింటికి ప్రభుత్వాలు కారణం కాదా..??
గడచిన 20 ఏళ్లలో మనదేశంలో తలసరి మద్యం వినియోగం రెండు రెేట్లు పెరిగింది. 2019లో రూ 2.21 లక్షల కోట్లుగా ఉన్న ఆల్కహాల్ మార్కెట్ విలువ నీరుటికి 3.25 లక్షల కోట్లకు చేరింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నివేదిక ప్రకారం మద్యం కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ మొదటి రెండు స్థానంలో ఉన్నాయి. 2021లో దేశీయంగా ప్రభుత్వాలు అన్ని కలిసి మద్యం ద్వారా 2.4 కోట్ల రాబడిని కళ్ళజూసాయి. కానీ తాగుడుతో ఒళ్ళు గుల్లయి ఉత్పాదకత పడిపోవడం, తాగుబోతుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వంటి వాటితో దేశం ఏడాదికి 4.5 లక్షల కోట్లను కోల్పోతుందని అంచనా. గ్రామీణ పేద కుటుంబాల ఆదాయంలో 15 శాతాన్ని మద్యం రక్కసి మింగేస్తుంది. సంక్షేమ పథకాల పేరిట ఒక చేత్తో ధన వితరణ చేస్తూ మరో చేత్తో మందు పోసి జనం జేబులను ఖాలీ చేయడం ప్రభుత్వాలకు పరిపాటైంది. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమైతే మద్యపాన నిర్మూలనకు కట్టుబడాలి. అలాగే మత్తు పదార్థాల విష వలయంలో నుంచి జన భారతాన్ని తప్పించాలి.

0 Comments