● 'బలం'అనే అంటున్న అభ్యుదయ వాదులు.
హైదరాబాద్, మార్చి 23, బిసిఎం10 న్యూస్.
అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనుకోవడం చాలా మంది భారతీయ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకూ అది కలే. దానిని నిజం చేసుకోడానికి పిల్లల్ని చిన్నప్పటి నుంచీ ఖర్చుకు వెనుకాడకుండా ఖరీదైన స్కూళ్ళలో చేర్పిస్తారు. వారి దృష్టి చదువు నుండి పక్కకు మళ్ళకుండా చూసుకుంటారు. అబ్బాయి లేదా అమ్మాయి అమెరికాలో చదవడానికి సీటు సంపాదించి, వీసా తెచ్చుకుని విమానం ఎక్కగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు.
● మరి మన భారతీయ విద్యార్థుల పట్ల అమెరికన్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది..??
ముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక భారతీయులు, ఇతర ఆసియా దేశస్తులు అమెరికాకు గుదిబండగా తయారయ్యారంటూ ట్రంప్ ప్రకటిస్తున్నాడు. అమెరికాలో పనుల కోసం చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారిని వెనక్కి పంపడం, అందునా, కాళ్ళకు, చేతులకు సంకెళ్ళు వేసి అత్యంత అవమానకరంగా వ్యవహరించడం, దాని పట్ల మోడీ ప్రభుత్వం నోరు మెదపలేని అశక్తతను ప్రదర్శించడం ఇదంతా అందరికి తెలిసిందే. అనుమతులు లేకుండా వెళ్ళారు గనుక వెనక్కి వారిని తిప్పి పంపవద్దని మనం అనలేం. కనీస మానవత్వ విలువల్ని అయినా పాటించలేదని, అంతర్జాతీయ మర్యాదలను గౌరవించలేదని మాత్రం విమర్శించగలం. కాని అన్ని అనుమతులతో అక్కడికి చదువు కోసం, రిసెర్చి కోసం వెళ్ళిన విద్యార్థుల విషయంలో సైతం ట్రంప్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, వివక్షాపూరితంగా ప్రవర్తిస్తోంది. కొలంబియా యూనివర్సిటీలో రిసెర్చి కోసం చేరిన రంజని శ్రీనివాసన్ అమెరికన్ అధికారుల నిర్బంధాన్ని తప్పించుకుని కెనడాకు పారిపోవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది..?? ఆమె చేసిన నేరం ఏమిటి..?? అమెరికన్ చట్టాలను వేటిని ఆమె ఉల్లంఘించింది..?? కేవలం పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనలను బలపరచడమే రంజని చేసిన నేరం. అదేమీ చట్ట విరుద్ధం కాదే..?? కాని అమెరికన్ ప్రభుత్వం ఆమె వీసాను రద్దు చేసి నిర్బంధించి వెనక్కి పంపాలని నిర్ణయించింది. రెండు రోజులు గడిచాయో లేదో బాదర్‌ఖాన్ సూరి అనే మరొక భారతీయ విద్యార్థి హమాస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడంటూ నిర్బంధించారు, అతడికి ఏ నేర చరిత్రా లేదు. ఫలానా నేరం చేశాడన్న ఆరోపణ కూడా ఏదీ లేదు, కాని నిర్బంధించారు. బహుశా అతడి భార్య పాలస్తీనా పౌరురాలు కావడమే కారణం అయిఉండొచ్చునని కొన్ని పత్రికలు వ్యాఖ్యానించాయి. అంటే అమెరికా వెళ్ళి అక్కడ ఇతర దేశాల నుండి వచ్చినవారిలో ఎవరినైనా జీవిత భాగస్వామిగా చేసుకోవడం కూడా నేరమేనా..?? పాలస్తీనా దేశాన్ని నాశనం చేయడానికి ఇజ్రాయిల్‌కి సహాయం చేయడమేగాక, అన్ని సందర్భాలలోనూ ఇజ్రాయిల్ చేస్తున్న దారుణమైన నేరాలను సమర్ధించడమే గాక ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పాలస్తీనా దేశస్తులైతే వారు నేరస్తులన్న భావనతో వ్యవహరించడం, వారిని పెళ్ళాడినవారు కూడా నేరస్తులేనని పరిగణించడం ఎంత ఘోరం. ఇదేదో ట్రంప్ ఒక్కరికే పట్టుకున్న మానసిక జాడ్యం కాదు. అమెరికన్ పాలకులందరికీ ప్రకోపిస్తున్న వికారం. చేజారిపోతున్న ప్రపంచాధిపత్యాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న యావ. ఏక ధృవ ప్రపంచం అంటూ అమెరికా చెలాయించిన దాదాగిరికి కాలం చెల్లిపోతోంది. డాలర్ ఆధిపత్యం తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటోంది. అత్యథిక రుణగ్రస్త దేశంగా అమెరికా మిగిలిపోయే ప్రమాదం దాపురించింది. ఈ దశలో తమ ఓటర్లకు ఏదో విధంగా భరోసా కల్పించడానికి ట్రంప్ ‘అమెరికాను మళ్ళీ గొప్ప రాజ్యంగా చేద్దాం’ అన్న నినాదాన్ని ఇచ్చాడు. ఆ నినాదమే అమెరికా ఆధిపత్యం చేజారిపోతోందని ఒప్పుకుంటోంది. అయితే ఇక్కడ చూడాల్సింది దాని వెనుక అమెరికన్ పాలకులకు పట్టుకున్న భయాన్ని. ఆ భయాన్ని కప్పిపుచ్చడానికి ఎవరు తేరగా దొరికితే వారిని బలిపశువుల్ని చేసి అమెరికన్ పౌరుల ముందు తమ బింకాన్ని ప్రదర్శిస్తున్నారు. అమెరికా ఆంతరంగిక భద్రతా కార్యదర్శి (అంటే మన హోం మంత్రి పదవి లాంటిది), 'అమెరికాకు వీసా పొందడం, ఇక్కడ చదువుకోవడం, ఇక్కడ జీవించడం ఒక గొప్ప ప్రత్యేక సదుపాయం' అంటూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు.
● మన దేశంలో కూడా చాలా మందికి ఇటువంటి అభిప్రాయమే ఉన్నట్టుంది.
అక్కడ చదువుకోడానికి అనుమతి లభించడం అంటే మనకి ఏదో పెద్ద ఉపకారం జరిగినట్టు భావిస్తున్నారు, కాని వాస్తవం వేరుగా ఉంది. గతేడాది అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య 11,26,690. వీరంతా 200 కు పైగా దేశాల నుండి వచ్చినవారు. వీరిలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులే. అంటే నాలుగో వంతుకు పైబడి ఉన్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల నుండి గతేడాది అమెరికా వసూలు చేసిన సొమ్ము 43.8 బిలియన్ల డాలర్లు (రూ 3,76,680 కోట్లు). ఇందులో భారతీయ విద్యార్థుల నుండి సుమారు లక్ష కోట్ల రూపాయలు వసూలు చేసి వుండాలి. అమెరికాలో సగటు వేతనం ఏడాదికి 48,000 డాలర్లు. ఒక విదేశీ విద్యార్థి సగటున చేస్తున్న ఖర్చు 40,000 డాలర్లు. అంటే భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడం అమెరికాకు భారం కాదు సరిగదా, ఆ దేశానికి చాలా లాభసాటి వ్యవహారం అన్నమాట. పైగా ఇంతమంది అక్కడ చదువుతున్నందువల్ల అమెరికాలో 3,78,000 ఉద్యోగాలు సృష్టించబడ్డాయని టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది.
● అంతే కాదు.
సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు (స్టెమ్ కోర్సులు) చదివే విద్యార్థులు అమెరికాలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందువలన అక్కడ ఈ రంగాలలో ఉద్యోగాలు చేయడానికి కూడా విదేశీ విద్యార్థులు అవసరమే. భారతీయ విద్యార్థులు చదువు ముగించుకుని అక్కడే స్థిరపడిన కారణంగానే సిలికాన్ వ్యాలీ వైభవాన్ని సాధించగలిగింది. ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అంటే భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రత్యేకంగా ఒరగబెట్టినది ఏమీ లేదు. మనవాళ్ళే అమెరికాకు ఎంతో ఉపయోగపడుతున్నారు. అటువంటప్పుడు మన మోడీ ప్రభుత్వం ఎంత బలంగా వ్యవహరించాలి. మన వాళ్ళకి అవమానాలు ఎదురౌతూంటే ఎంత గట్టిగా స్పందించాలి. మానవ హక్కుల రక్షణకు, ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు ట్రంప్ ఎంత వ్యతిరేకమో, ఇక్కడ మోడీ కూడా అంతే వ్యతిరేకం. పాలస్తీనా విషయంలోనూ మోడీది ట్రంప్ బాటే. అందుకే అక్కడా, ఇక్కడా భారతీయుల్ని భయభ్రాంతుల్ని చేసి నోరెత్తకుండా ఉండేలా చూడాలని వారిద్దరూ భావిస్తున్నారు. అమెరికా నుండి ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యం మోడీ ప్రభుత్వానికి కావాలి. కాని అక్కడ ఉంటున్న భారతీయుల హక్కులకు భంగం కలిగితే మాత్రం నోరు మెదపరు. అమెరికన్ ఏలికలకు అంతగా లొంగిపోయి మన దేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న మోడీ ప్రభుత్వం మన రాష్ట్ర పాలకుల దృష్టిలో మాత్రం చాలా గొప్పది. ట్రంప్ ముందు మోడీ చేతులు జోడిస్తే, మోడీ ముందు మన రాష్ట్ర ప్రధాన నేతలందరూ మోకరిల్లుతారు. ఇక ఇప్పుడు నోరు విప్పి బలంగా ప్రజాస్వామ్య విలువలను, దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకోడానికి నడుం బిగించాల్సింది సాధారణ ప్రజానీకమే. వారికి ఎప్పుడూ వామపక్షాలు, అభ్యుదయ వాదులు అండగా ఉంటారు, సో మూవ్ ఆన్.

0 Comments