Breaking News

Loading..

'మనిషి' చుట్టూ అజ్ఞానపు ప్రపంచం..!!


ఖమ్మం, ఫిబ్రవరి 09, బిసిఎం10 న్యూస్.

మనిషి ముందుగా హేతువాది, కానీ అతని హేతుత్వం బయటపడనీయకుండా, ఆలోచించనీయకుండా, మన చుట్టూ అజ్ఞానపు కార్యక్రమాలు ఆలోచించే వ్యవధి ఇవ్వకుండా జరుగుతూనే ఉన్నాయి. మనిషికి ఊపిరి సలపకుండా, ఉక్కిరిబిక్కిరి అయ్యేట్టుగా ఇంటా బయట మతాల, కులాల, కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతూనే ఉన్నాయి. కనీసం ప్రభుత్వం, మేధావులు దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. మనిషి ఇంటి బయటకు వెళ్ళినప్పటి నుండి వీధి వీధికి మతాలు గుళ్ళు ప్రార్ధనలు స్పీకర్లలో పాటలు పద్యాలు వినవస్తూనే ఉంటాయి. దేవుడి ఉనికి కాపాడుట కోసం, మతాల ప్రచారం కోసం మన దేశంలో ఎన్నో మత సంస్థలు నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాయి. అమాయకులైన ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటూనే ఉన్నాయి. ఇది కనిపెట్టని ప్రజలు దేవుడి పై భారం వేసి పోలోమంటూ ఆధ్యాత్మిక ప్రార్థన మందిరాల చుట్టూ తిరుగుతున్నారు. మతాల వల్ల లాభపడేవారు ఈ సంస్థలను నిర్వహిస్తూ ప్రజల్ని అజ్ఞాన బాట పట్టిస్తున్నారు. ప్రభుత్వం వారు కూడా ప్రజల్ని అజ్ఞానంలో ఉంచడానికి, మత సంస్థలకు ప్రార్థన మందిరాలకు డబ్బులు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నాయి.

● ఇంట్లో ఉంటే.

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో టీవీ చిన్నదో, పెద్దదో తప్పనిసరిగా ఉంటుంది.  టీవీ కార్యక్రమాలు మనకు ప్రపంచంలో ఎటువంటి సంఘటనలు జరిగినా అదే నిమిషంలో తెలియజేయడానికి, మనలో జ్ఞానాన్ని పెంచడానికి ఉద్దేశింపబడినవి. కాని దానికి విరుద్ధంగా మనలో అజ్ఞానాన్ని పెంచి పోషిస్తూ, ప్రతిక్షణం మన మెదళ్లను అజ్ఞానంతో నింపుతూ, మతాల మత్తులో ముంచేస్తున్నాయి.

● 'మతం కాని మనిషి మహిలో లేడు' అన్నట్టుగా మన దేశంలో ప్రతి మనిషికి ఒక మతం ఉంది. ప్రతి మనిషికి ఒక కులం ఉంది. ఇంట్లోనూ, ఒంట్లోనూ, సమాజంలోనూ ప్రతి చోట అజ్ఞానపు చీకట్లు ముసురుకుంటున్నాయి. రిమోట్ చేతిలోకి తీసుకుని నొక్కితే చాలు వరుసగా టీవీ చానళ్లు ఎస్వబిసి/ సాయిధర్మ/హిందూధర్మ/ భక్తి/యోగి/శివశక్తిశాయి/ఎస్ఎస్ఎస్/ సివిఆర్ఓం/పూజ/శుభవార్త/కల్వరి/గాస్పెల్/ఆరాధన/ఆస్థాభజన్/అప్సాస్/పరాస్/ఈశ్వర్/పీస్ ఆఫ్ మైండ్/ఆస్థా/సంస్కార్/మదాని/విన్ చానల్/ మున్సిఫ్/జీ సలాం/వేదిక్/సత్సంగ్/శ్రీ శంకర/వంటి చానెళ్లన్నీ దేవుడూ, మతమూ, భక్తీ టీవీ, వాస్తు, జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, రుద్రాక్షలు ధరించడం టివి నిండా ఇవే కార్యక్రమాలు ఇక లైవ్లో పూజలు, పునస్కారాలు, దేవుని పేరుతో ఉత్సవాలు జాతరలు సినిమాలలో సీరియల్స్ లో కూడా మతానికి సంబంధించిన దేవుళ్ళ కార్యక్రమాలు ఇవే కనిపిస్తుంటాయి వినిపిస్తుంటాయి. ఇంట్లో తీరిగ్గా కూర్చొని ఆలోచించనివ్వకుండా మన మెదళ్ళను భక్తి పిచ్చితో నింపేస్తున్నాయి. ఇక అదే టీవీలో తినే తిండి, కట్టే బట్టమీద కూడా దేవుడి పేరుతో దాడి పెంచేశారు. మన ఇంట్లో మనం ఏ వైపున ముఖం పెట్టి కూర్చోవాలో ఏ వైపున పడుకోవాలి..?? మలవిసర్జనకు  ముఖము ఎటువైపున ఉంచాలో కూడా చెప్పే నీచమైన పంతుల్లు కూడా ఉన్నారు. క్రైస్తవులు కల్వరి నూనె, హిందువులు పతంజలి పేస్టు, ముస్లింలు ఫలానా టూరిస్ట్ అంటూ మొదలెట్టేస్తారు. రంగురాళ్లు, రుద్రాక్షలు, న్యూమరాలజిస్ట్లూ, వాస్తు పండితులూ, ఫలానా పూజా మందిరాలూ, భూత వైద్య శిబిరాలూ వీటికి అదనంగా ఉండనే ఉన్నాయి. 'ప్రవచనాల పేరిట ప్రతి సాయిబు, స్వామి, పాస్టరూ ఎలా స్నానం చేయాలో, గోచీ ఎవరు ఎలా ఉతకాలో, ఎవరు ఉతకాలో మొదలుపెట్టి చివరికి ఎలా బతకాలో కూడా చెప్పేవాడే'. ఇక దెయ్యాలను పారద్రోలే దయ్యాల మాంత్రికులు కూడా ప్రతి ఊర్లోను కనిపిస్తుంటారు. మానసిక ఆరోగ్యం బాగోలేక పిచ్చిగా ప్రవర్తించడం గమనించి దెయ్యం పట్టిందని, ఆత్మ ఆవేశించిందని మోసం మాటలు చెబుతూ దెయ్యాల మాంత్రికులు మనుషులను ఘోరంగా హింసిస్తారు. వాళ్ల చేతులు, కాళ్లు కట్టేసి కర్రలతో కొమ్మలతో కొట్టి గాయపరుస్తారు. ఆ దెబ్బలకు తాళలేక కొందరు చనిపోయిన సంఘటనలు కూడా మనం వింటుంటాం 

● మన ఇంటి గడప దాటడానికి ముందే.

కొందరు యమగండం, రాహుకాలము, సుముహూర్తాలు చూసుకుని ఇంటి నుండి బయలుదేరుతారు. మంగళవారం ఆ దిక్కు పోకూడదని, గురువారం ఈ దిక్కుపోకూడదని పంచాంగంలో ఉన్న వాటిని యధావిధిగా పాటించేవారు కూడా కొందరు ఉంటారు, ఆ దిక్కుకు వెళ్లే బస్సులు, రైలు, వాహనాలు, మనుషులు పోకుండా ఉంటారా..?? అని కనీస ఆలోచన, జ్ఞానం కూడా లేక కొందరు ప్రవర్తిస్తుంటారు. శుక్రవారం ఇతరులకు డబ్బు ఇవ్వకూడదని మూఢంగా, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. దుకాణాల్లో డబ్బు  ఇవ్వనిదే మనకు సరుకులు రావు కదా లాంటి కనీస ఆలోచన కూడా కొందరికి ఉండదు. కనీస ఆలోచన చేయలేని మూర్ఖుల వల్లనే ఈ సమాజం చెడిపోతుంది. ఇక ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముహూర్తం చూడవలసిందే. దానికోసం అంతగా చదువు రాని ఒక బ్రాహ్మణుడి దగ్గరికి విద్యావంతులు సైతం వెళ్ళవలసిందే. ఇల్లు కడితే పూజలు, ఇల్లు కట్టడానికి ముందే పూజలు, ఇల్లు కట్టిన తర్వాత పూజలు, గృహప్రవేశం కోసం పూజలు, రోగం వస్తే పూజలు, చస్తే పూజలు, బతికితే పూజలు చేసేవారు మన మధ్యనే ఉంటారు. మనిషి పుట్టిన గడియ నుండి చనిపోయే గడియ వరకు, షాపు ప్రారంబించినా, కంపెనీ ప్రారంభించినా చివరకు తల వెంట్రుకలు తీసుకున్నా మంచి రోజు చూస్తుంటారు, పంతుల్లకు దక్షిణలు చదివిస్తుంటారు. ఇవన్నీ పంతులు బొజ్జ నింపుకోవడానికి ప్రజలకు లేని పోనివి కల్పించి చెబుతారు. ప్రతి పనికి పూజలు చేస్తుంటారు. 

మమ్మల్ని కాపాడమని, మాకు ఐశ్వర్యం ప్రసాదించమని, మాకే కష్టం రాకూడదని, ఆకాశం వైపు చూస్తూ చేతులెత్తి దండాలు  పెడుతుంటారు. సుఖదుఃఖాలకు అన్నింటికి దేవుడే కర్త ఆని నమ్ముతారు. అన్ని దేవుడే చేస్తాడని, మనల్ని పుట్టించాడని, సుఖదుఃఖాలకు ఆయనే కర్త, కారణమని, ఆయనను ప్రార్థిస్తే అన్ని కష్టాలు తీరుతాయని, సుఖం లభిస్తుందని ప్రవచనాలు చెప్పే మోసకారి దొంగ పంతుల్లను మనం ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉంటాం.

● ఇక గడప దాటి బయటకు వస్తే.

వీధి వీధినా మతాల గుళ్ళు, గోపురాలు, ప్రార్థనా మందిరాలు మన చెవిలో అదే హోరు ప్రతిధ్వనిస్తుంటుంది నామదారులు, వేషదారులు కనబడుతుంటారు. వీధిలోగవర్నమెంటు స్కూలు నుండి మిషనరీ స్కూలు దాకా రాబోయే తరాల్ని ప్రశ్నించడం మానేసేలా ప్రతిరోజూ పొద్దున్నే ప్రార్థన పేరుతో పసిమెదళ్ల ట్యూనింగ్. చిత్రమైన విషయమేమిటంటే సైన్స్ నేర్పాల్సిన ఉపాధ్యాయులు కూడా పాఠశాలల్లో దేవుళ్ళ ప్రార్థనలు చేయిస్తారు. గోడలకు దేవుళ్ళ పటాలు వేలాడదీస్తారు. రోడ్డుమీద కార్థీక మాసం, రంజాన్ మాసం, డిసెంబర్ మాసం అదనంగా ప్రతినెలా రెండు మూడు పండగలు, అవి మర్చిపోవద్దని గుర్తుచేస్తూ వీధుల్లో రోడ్లన్నీ మూసి ఎదురుగా పీర్లు, వినాయకుల, దుర్గమ్మల  విగ్రహాలు. శుక్రవారం ముస్లింలూ, ఆదివారం క్రైస్తవులు, మిగతా ఐదు రోజులూ హిందువుల దాడి. అలారోజులన్ని అజాలు వినిపిస్తారు, ప్రతి పండగకి మైకులు చెవుల్లో దూర్చేస్తారు. పిచ్చిముదిరిన రోజల్లా పక్కింటివాడి కొంపలో భజనో, ప్రార్థనో ఏర్పాటు. ఇవి సరిపోకపోతే మైదానాల్లో దేవునితో రెండురాత్రులు, ఆదివారం పండుగలు కూడికలు ఫలానా స్వామీజీతో సాయంత్రం, ఫలానా ఇస్లాం శాఖ ఇజ్తెమా. ఇక ప్రతి మతపెద్దా తానో పేద్ద సర్వఙ్ఞడని ఎద ఎత్తుకొని నడక. 'నా కాళ్లు పట్టుకోవా' అనే వెధవ బెదిరింపు చూపులు. రోడ్డుమీద ప్రతి వాహనం ముందూ, వెనకా సైకిల్ వద్ద నుండి కాస్ట్లీ కారు దాకా దేవుడి ఫోటోలు, రాతలు. రోడ్డులో నడుస్తున్నా, వాహనం మీదున్నా, రోడ్లకిరువైపులా చూస్తూ గుండెల మీద శిలువల ముద్రణ, చెవులు పట్టుకోవడం, కళ్లు మూసుకోవడం, ఆ చెంపా ఈ చెంపా తామే ఫటాఫటా వాయించుకొంటున్నాడా, లేడా అని చూసే చర్చి, మసీదు, గుడిగోపురాలు. లిఫ్ట్ నీ, మిషన్ల నీ, కంప్యూటర్ల నీ, చివరికి ఆకాశంలోకి పంపే రాకెట్లనీ వదలని పూజలు, ఫోటోలు, అగరొత్తులు.

● ఇవన్నీ దాటుకుని.

ఉద్యోగ నిమిత్తమై ఆఫీస్ కి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అయ్యేది గోడలకు దేవుళ్ళ క్యాలెండర్లు, టేబుల్ల పై దేవుళ్ళ బొమ్మలు, మొబైల్ ఫోన్లలో దేవుళ్ల రింగ్టోన్లు ఇవన్నీ చెవులు గింగురుమంటూనే ఉంటాయి. ప్రతి ఆఫీసుల్లో ముందు వృత్తికి గాక గోడలకు తిరిగి దండాలు. ప్రతి ఉద్యోగి చివరికి ప్రభుత్వ ఉద్యోగి టేబుల్ మీదా పరచిన దేవతలు. పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నా భక్తి, సరస్వతి దేవికి గుడులు, వినాయక విగ్రహాల స్థాపన, వారం పది రోజులు పిల్లలకు పాఠాలు జరగవు. పూజలు ఇక దర్గా, చర్చ్ లదే తర్వాయి. ప్రతి కార్యక్రమారంభ ముగింపులు, ప్రతి వేడుక, కలయికలు దైవ, మత సంబంధమైనవే. ఏ మనిషీ మనిషిలా గాక తన మతానికి నిలువెత్తు ప్రాతినిద్యం వహిస్తూ నుదిటిన బొట్లూ, నామాలూ, తలెత్తితే తలమీద టోపీ, తలదించితే మెడలో శిలువ. నోరిప్పితే చాలు వాటిని ఎన్నడూ చదవనోడు సైతం ఖురాన్, భగవత్గీత, బైబిల్ సూక్తులు మనకు తెలిసేలోగానే మాటల్లో అలా దొర్లించేసివుంటాడు. ఫోన్ మోగితే చాలు గాయత్రీ మంత్రం, ఖురాన్ సూక్తులు, యేసయ్య పాటలు రింగ్ టోన్లుగా.

ఇన్ని రోజువారీ పరీక్షలు దుర్నీక్షతతో ఎదుర్కొంటూ శరీరాన్నీ, మనస్సునీ, మేధస్సునీ హేతుబద్దంగా, తార్కికంగా, సశాస్త్రీయంగా, మానవీకరణంగా ఒక వ్యక్తి ఈ దేశంలో బ్రతకాలంటే సముద్రమంత స్థైర్యం కావాలి, హిమాలయమంత ఎత్తైన వ్యక్తిత్వం కావాలి. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తే మంచిది. ఇప్పటికే మూఢాచారాల్లో, అజ్ఞానాంధకారంలో మూర్ఖత్వంతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మెదళ్ళలో పట్టిన బూజు దులుపుకుంటే మత చెత్తను తీసివేయకుంటే మానవులుగా బతుకులు వ్యర్థం అవుతాయి. మనిషికి ప్రతిక్షణం ఇలా అజ్ఞానం మాటలు చేతలు  వినవస్తుంటే అజ్ఞానపు చీకట్లు చుట్టూరా ముసురుతుంటే ఇక వైజ్ఞానిక ఆలోచనలు ఎలా వస్తాయి. సైన్స్ పరంగా ఎలా ఆలోచిస్తాడు, ఇది మన సమాజ దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు ఎలా తయారవుతారు. శాస్త్రీయంగా ఎలా ఆలోచిస్తారు. అందుకే మన దేశంలో బాబాలకు స్వామీజీలకు ఉన్నంత విలువ శాస్త్రజ్ఞులకు ఉండదు. మనదేశంలో చదువుకు విలువ లేదు చదువురాని మూర్ఖుడు వేషం వేసి బాబాను అంటే చదువుకున్న మూర్ఖులు, చాంతాడంత పొడవైన డిగ్రీలు సంపాదించిన వారు కూడా వాని కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారాలు పెడతారు. ఇక ఈ సమాజాన్ని హేతువాదులే రక్షించాలి.

Post a Comment

0 Comments