Breaking News

Loading..

'పరువు'కు వైకల్యం..!!


ఖమ్మం, ఫిబ్రవరి 09, బిసిఎం10 న్యూస్.

సమాజంలో భాగమే, కానీ సాధారణ జీవితం గడపలేరు. అందరితో సమానమే అయినా ఆత్మవిశ్వాసంతో ఉండలేరు. శారీరక సమస్యల కంటే కూడా మానసిక వైకల్యం వారికి ప్రతిబంధకమౌతుంది. న్యూనతా భావానికి గురిచేస్తుంది. ‘కనబడే వికలం కన్న మదిలో వైకల్యమున్న మహా ప్రమాదకరము దీన్ని ఎరిగి మసలుమన్న’ అంటారో కవి. ఇదో సంక్లిష్ట వాస్తవ స్థితి. పరిజ్ఞానం, ప్రవర్తన వంటి అంశాలకు సంబంధించి కనిస్తుంది. ఏది నిజమో ఏది కాదో చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ప్రతి 8 మందిలో ఒకరు చొప్పున ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల మంది మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. ఈ వైకల్యానికి వారు బాధ్యులు కాకున్నా సామాజిక వివక్ష, మానవహక్కుల ఉల్లంఘనను ఎదుర్కొంటున్నారు. అందరూ ఉన్నా, అన్ని హక్కులూ ఉన్నా ఏమీ వినియోగించుకోలేని వారుగా బతికేస్తున్నారు. వారేం చేస్తున్నారో వారికే తెలియని స్థితి. కొన్నిసార్లు వారికివారే హాని చేసుకోవడమో, ఇతరులకు హాని చేయడమో చేస్తుంటారు.

● ఏ వైకల్యం లేని మనిషి జీవితం సాఫీగానే సాగిపోతుంది.

చిన్న వైకల్యం ఉన్నా అది జీవితాంతం వారిని పీడిస్తుంది. కొందరు పుట్టుకతో ఆరోగ్యవంతులుగా పుట్టినప్పటికి హఠాత్తుగా మానసిక రోగులుగా మారుతుంటారు. మొదట్లో దీన్ని తేలిగ్గా తీసుకోవడంతో సమస్య జటిలంగా మారుతుంది. చాలామందికి మానసిక వైకల్య సమస్యల పై నిశితమైన పరిశీలన లేకపోవడం, ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన వైద్య చికిత్స అందించలేకపోవడం, మానసిక వైకల్యం ఉన్నవారికి చికిత్స చేసే వైద్యులు అందుబాటులో లేకపోవడం వంటివి కారణమౌతున్నాయి. తమ పిల్లలకు మానసిక వైకల్యమని చెప్పుకోడానికి కూడా భయం. బంధువుల్లో పరువు పోతుందనో, చులకనైపోతామనో దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రుగ్మతలున్న వారు తేడాగా ప్రవర్తిస్తుంటారు లేదా ఇతరుల దృష్టిలో వింత ఆలోచనలు, ప్రవర్తన ఉన్నవారిగా కనిపిస్తుంటారు.

‘ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దని మందలించిన తల్లి పై కత్తితో దాడి చేయడంతో, ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. అతనికి మతి స్థిమితం సరిగాలేదని బంధువులు చెబుతుండగా, అప్పుడప్పుడు బట్టలు వేసుకోకుండానే ఇంట్లో తిరిగేవాడని పనిమనిషి చెబుతుంది’ ఇదొక ఉదాహరణ మాత్రమే. మానసిక వైకల్యం వచ్చిన వారిలో సగానికి పైగా 14 ఏళ్ల లోపు నుంచే ఈ సమస్య ప్రారంభమౌతుంది. మానసిక రుగ్మతలు, మానసిక వైకల్యం వంటివన్నీ ఒకేలా వుండవు. ఈ బలహీనతలు పెరిగి పెద్దవడానికి కుటుంబ సభ్యులు కూడా కారణమౌతున్నారని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. మానసిక వైకల్యాన్ని పరువుకు సంబంధించిన అంశంగా చూస్తున్నారే తప్ప ఇదొక అనారోగ్య సమస్య అని, అన్ని రోగాల మాదిరిగానే చికిత్స చేయించాలన్న భావనతో చూడలేకపోతుండడం కూడా ఒక సామాజిక రుగ్మత. ఆందోళన, నైరాశ్యం వంటి మానసిక రుగ్మతలు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్నాయి. వారి విపరీత ప్రవర్తన వల్ల ఎటువంటి అనర్థాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కుటుంబంతో పాటు సమాజానికి ఉంది. అందరిలాగే సమాన గౌరవం, జీవించే హక్కు వారికి ఉంది. మానసిక వైకల్యం కారణంగా ఎవరిని వివక్షకు గురిచేయకూడదని ఐరాస స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న చాలామందికి సమర్థవంతమైన సంరక్షణ, చికిత్స అందుబాటులో లేదు. సరైన సమయంలో సరైన చికిత్స అందించడం ద్వారా వారిని మామూలు మనుషులుగా తీర్చిదిద్దవచ్చు. నోబెల్‌ బహుమతి గ్రహీత, అమెరికన్‌ కవయిత్రి లూయిస్‌ గ్లక్‌ చిన్నప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడేది. తరచూ చావు గురించి ఆలోచించేది. కొన్నేళ్లపాటు మానసిక చికిత్స కూడా తీసుకుంది. తన తల్లి వినిపించిన గ్రీకు పురాణగాథలు, ప్రకృతి ఆరాధన వంటివి లూయిస్‌ను ఎంతగానో ప్రభావితం చేశాయి. మానసిక రుగ్మతల నుంచి, చనిపోవాలన్న కోరిక నుంచి సాహిత్యం వైపు నడిపించాయి. మనిషి తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు ‘అలుముకున్న చీకటిలోనే అలమటించనేల కలతలకే లొంగిపోయి కలవరించనేల సాహసమను జ్యోతిని చేకూని సాగిపో’ అంటారు మహాకవి శ్రీశ్రీ. మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స అందించగలిగితే, కుటుంబం వారికి అండగా ఉంటె వారు కూడా సమాజంలో గొప్పవారిగా నిలబడతారన్నది మా భావన.

Post a Comment

0 Comments