జ్ఞాన దీపం ముందు మూఢనమ్మకాల ముసురు. తొలి రోజు తరగతి గదుల్లో కనిపించని చిన్నారుల సందడి. చంద్రుడి చీకటికి విద్యతో ఏమిటి సంబంధం..?? ఏఐ యుగంలోనూ అజ్ఞానానికి లొంగిన మనస్తత్వం. పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉండాల్సిన రోజున, కొందరి మనసుల్లో మాత్రం అమావాస్య నీడలు ముసురుకున్నాయి. జ్ఞాన ద్వారాలు తెరుచుకున్న వేళ, మూఢనమ్మకాల తాళాలు చిన్నారుల అడుగులను బడి గుమ్మం వద్దే ఆపేశాయి. చంద్రుడు కనిపించకపోవడం ప్రకృతి సహజమైన ఖగోళ ఘటన మాత్రమే అయినా, దానిని అశుభానికి ప్రతీకగా భావించడం, విద్యా వెలుగు పై అజ్ఞానపు మబ్బులు కమ్ముకున్న దుస్థితిని గుర్తు చేసింది. అక్షరమే అంధకారాన్ని పారద్రోలే శక్తి అని చెబుతూనే, అదే అక్షరానికి అమావాస్య పేరుతో అడ్డుకట్ట వేయడం సమాజం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశంగా మారింది.
● అమావాస్య గెలిచిందా - అక్షరం ఓడిందా..??
వేసవి సెలవుల తర్వాత పిల్లల కేరింతలతో కళ కళలాడాల్సిన పాఠశాల ప్రాంగణాలు మొన్న సోమవారం ఆశించిన సందడిని చూడలేకపోయాయి. బడి గంట మోగినా, బుడి బుడి అడుగులు మాత్రం తరగతి గదుల వైపు సాగలేదు. కారణం ఒక్కటే సోమవారం రోజు అమావాస్య కావడం. పిల్లల భవిష్యత్తుకు వెలుగులు నింపాల్సిన రోజునే తల్లిదండ్రులు చీకటి భావనలకు బందీలయ్యారు. పోయి పోయి అమావాస్య రోజున బడికి పంపాలా అంటూ పిల్లలను ఇంటి గడప దాటనివ్వలేదు. ఫలితంగా విద్యాలయాల ఆవరణలో ఉండాల్సిన సందడి అరకొర హాజరుతో వెలవెలబోయింది.
● చంద్రుడు కనిపించకపోతే జ్ఞానం కనిపించదా..??
అమావాస్య అనేది ప్రకృతిలో సహజంగా జరిగే ఖగోళ సంఘటన మాత్రమే. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒక నిర్దిష్ట స్థానంలో ఉండటంతో చంద్రుడు మనకు కనిపించని రోజును అమావాస్యగా పిలుస్తారు. దానికి శుభానికి, అశుభానికి, విద్యకి, విజ్ఞానానికి ఎలాంటి సంబంధం లేదని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. కాని శాస్త్రాన్ని నేర్పే పాఠశాలలకే పిల్లలను పంపకుండా ఉండటం విరుద్ధమైన పరిస్థితిని తలపిస్తోంది. ఒకవైపు కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని మార్చేస్తుంటే, మరోవైపు అమావాస్య పేరుతో పిల్లలను ఇంట్లో కూర్చోబెట్టడం ఆలోచింపజేస్తోంది. చంద్రుడి చీకటి కంటే మనసులోని అజ్ఞానమే సమాజాన్ని ఎక్కువగా వెనక్కి లాగుతుందనే విషయం గుర్తించాల్సిన అవసరం ఉంది.
● మూఢనమ్మకాల బంధం తెంచాల్సిందే.
మూఢనమ్మకాలను పారద్రోలే శక్తి విద్యకు ఉంది. అలాంటి విద్యనే మూఢనమ్మకాలతో ముడిపెట్టడం సమాజ పురోగతికి మంచిది కాదు. పాఠశాలకు వెళ్లే రోజు, చదివే పుస్తకం, నేర్చుకునే పాఠానికి మంచి చెడు రోజుల ప్రమాణాలు ఉండవు. పిల్లలకు శాస్త్రీయ దృక్పథాన్ని నేర్పాల్సిన పెద్దలే ఇలాంటి భావనలకు లోనైతే తదుపరి తరానికి తప్పు సందేశం వెళ్తుంది. బడి గుమ్మం దాటే ప్రతి అడుగు భవిష్యత్తు వైపు పడే అడుగు అని గుర్తించాలి. అమావాస్య రోజు బడికి పంపితే ఏమీ జరగదు, కానీ అజ్ఞానం పేరుతో పంపకపోతే పిల్లల మనసుల్లో శాస్త్రీయ ఆలోచనలకు మాత్రం గాయం మిగులుతుందనే విషయాన్ని సమాజం గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది.

0 Comments