పుట్టిన ప్రతి వ్యక్తి అభివృద్ధికి విద్య అవసరం, దీనితోనే అతడి సర్వతోముఖాభివృద్ధి సాధ్యం. మానవ వనరుల అభివృద్ధి విద్యతోనే సాధ్యం. అందుకే భావి భారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయ వర్గం అంటే సమాజానికి ఎనలేని గౌరవం. ఒకప్పుడు కేవలం ప్రభుత్వ రంగంలో మాత్రమే బడులు ఉండేవి. ఏవో కొన్ని మిషనరీ పాఠశాలలు సేవా దృక్పథంతో కొన్ని పాఠశాలలు ఉండేవి కానీ తర్వాత రోజుల్లో విద్య వ్యాపారంగా మారడంతో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వెలిశాయి. అవి విద్యార్థులకు పెద్ద భవనాలు, యూనిఫామ్స్, టై, డైరీ, బూట్లు లాంటి ఆకర్షణీయమైన వాటితో తల్లిదండ్రుల వద్ద డబ్బులు బాగా వసూలు చేస్తూ మార్కెట్లో ప్రభుత్వ పాఠశాలలకు ఒక సవాల్‌గా మారాయి. కాలక్రమంలో ఆంగ్ల మధ్యమం కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ కాగా ప్రభుత్వ రంగంలోని పాఠశాలలు తెలుగు మీడియం వరకే పరిమితమైయ్యాయి. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో ఫలితాలు, ర్యాంకులు కార్పొరేట్ విజయానికి వాటి అభివృద్ధికి సోపానాలయ్యాయి. అదే పరిస్థితుల్లో సిబ్బందిని నియమించక, సౌకర్యాలు లేక అడ్మిషన్లు తగ్గి ప్రభుత్వ పాఠశాలలకు క్రమంగా ఆదరణ తగ్గింది. ప్రైవేట్ కార్పొరేట్ రంగాలకు పోటీగా కేవలం గురుకుల విద్యాలయాలు మాత్రమే ఫలితాలు, ర్యాంకులు సాధిస్తూ దీటుగా నిలిచాయి. కానీ అవి పరిమిత సంఖ్య కావడంతో విద్యలో ప్రైవేటు ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కుల గురుకులాల సంఖ్య వెయ్యికి పైగా పెంచింది. అవి పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్య అందిస్తూ క్రీడల్లో ప్రోత్సహిస్తూ కెజి నుండి యుజి వరకు (కొన్నిచోట్ల పిజి కోర్సులు కూడా) పేద విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందిస్తూ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా వాటికి సరిపోను నిధులు విడుదల చేయకపోవడంతో, భవనాలు లేక సౌకర్యాల లేమితో అవి వెల వెల బోతున్నాయి. వాటి స్థానంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రవేశపెట్టే పథకంలో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగు లేదా ఐదు గురుకులాలను ఒకే ప్రాంగణంలో నిర్వహించడానికి 200 కోట్లు విడుదల చేస్తుంది. మొత్తం రూ. 22 వేల కోట్లతో వీటి నిర్మాణం జరుగుతుంది. అత్యాధునిక సౌకర్యాలు, నైపుణ్యాల శిక్షణ వీటి ప్రత్యేకత అని ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఇక తెలంగాణ విద్యా కమిటి ఆకునూరు మురళి నేతృత్వంలో ఇచ్చిన నివేదిక ప్రకారం మండలంలోని ఏకోపాధ్యాయ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఒకే చోట ఒకే భవనంలో ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఒక్కొక్క పాఠశాలలో 1500 మంది విద్యార్థులు నర్సరి నుండి ఇంటర్మీడియట్‌వరకు చదువుకుంటారు. మండలంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండు లేదా మూడు కూడా ఇలాంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నడపడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటనల ద్వారా తెలుస్తుంది.
● గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటాయి.
గిరిజన తండాలు గూడెంలలో గిరిజన విద్యా వికాస కేంద్రాలు ఉంటాయి. ఆశ్రమ పాఠశాలలు ఉంటాయి. ఇవన్నీ అక్కడి స్థానిక విద్యార్థినీ విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారికి విద్య నేర్పుతుంటాయి. కానీ ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి పాఠశాలలు మాయమవుతాయి. వాటి స్థానంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రత్యక్షమవుతాయి. ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం 27,000 ప్రభుత్వ పాఠశాలలు త్వరలో అదృశ్యమవుతాయి. కేవలం 4 వేల పాఠశాలలు మాత్రమే నడుస్తాయి. అందులో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి. ఈ ఏడాది ఇంటర్ కళాశాలలు ప్రత్యేకంగా నడుస్తున్నా వచ్చే ఏడాది నుండి వాటి మనుగడ కూడా ప్రశ్నార్థకమే. ఏకోపాధ్యాయ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరి, జూనియర్ కళాశాల, ఆశ్రమ, గిరిజన విద్యా వికాస కేంద్రాలు, మోడల్ స్కూల్స్, మున్సిపల్ పాఠశాలలు కనుమరుగు కాబోతున్నాయన్నమాట.
● అన్నింటికి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మాత్రమే ప్రత్యామ్నాయం కాబోతున్నాయా..??
సరైన భవనాలు ఉన్నచోట, సరిపోను సిబ్బంది ఉన్నచోట అడ్మిషన్లు చాలా బాగా నడుస్తున్నాయని, ఫలితాలు బాగా వస్తున్నాయి అన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా..?? ప్రతి కిలోమీటర్ పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలని కమిషన్లు, నివేదికలు ఘోషిస్తున్నాయి. కాని అందుకు విరుద్ధంగా మన ప్రభుత్వం మాత్రం మండలంలో మూడు లేదా నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నెలకొల్పే ప్రయత్నం చేయడం సమంజసమేనా..?? పరిసరాల్లోని పాఠశాలలను విలీనం చేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే నామకరణంతో వాటిని తీర్చిదిద్దుతారట. పాఠశాలలు దూరమవుతున్నాయి అంటే పేదలు చదువుకు దూరం అవుతున్నట్లే లెక్క. విద్యార్థులకు రవాణా సౌకర్యం అది కూడా పేరెంట్స్ ‘సహకారం’తో ఏర్పాటు చేస్తారట. జపాన్ దేశంలో ఒక్క అమ్మాయి కోసం ఆ ప్రభుత్వం ఒక ప్రత్యేక రైలు నడుపుతోందట.
● మన ప్రభుత్వాలు అంత భరించగలవా..??
అరకొర నిధులతో నడిచే పాఠశాలలకు పునరుజ్జీవం కల్పించాలి. భవనాలు లేవని, సౌకర్యాలు లేవని, సిబ్బంది లేరని, ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రావడం లేదు. కానీ అక్కడ నాణ్యత లేదని ఫిర్యాదు ఇంతవరకు ఏ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదు. కానీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో జరగబోయే విలీనం మరిన్ని సమస్యలను తీసుకొస్తుంది. అన్ని పాఠశాలలు నర్సరి నుండి పదివరకు, ఇంకా ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్ లో నిర్వహించాలనడం కూడా అశాస్త్రీయం. ఒకే చోట ఒక విద్యార్థి 12 ఏళ్లకు పైగా చదవాలనడం అతనికి మానసికంగా విసుగు తెప్పిస్తుంది. అదే విధంగా ఒకే ప్రధానోపాధ్యాయుడు 1500 మంది విద్యార్థులను అజమాయిషి చేయగలడా..?? కొన్ని వేల టీచర్ పోస్టులు ఏమవుతాయి..?? భవిష్యత్తులో కాంట్రాక్టు టీచర్లను తీసుకోబోమని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందా..?? అసలు ఇంటర్మీడియట్ విద్య ఏం పాపం చేసింది..?? నాడు వైఎస్‌ఆర్ కూడా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని, అంతా ఇంగ్లీష్ మీడియం చదవాలని చేసిన ప్రయత్నాలు ఉపాధ్యాయ ఉద్యమాలతో వెనక్కు మళ్లాయి. మళ్లీ నేడు అదే విధానం మొదలైంది. అసలు రాష్ట్రం సమీప భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానాన్ని అనుసరించబోతున్నదా లేదా అనేదానికి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
ముఖ్యమంత్రి మాత్రం ఆ విధానాన్ని వ్యతిరేకిస్తామని రాష్ట్రంలో అమలుపరచబోమని పదేపదే చెప్పగా బోర్డుల విలీనం వంటి అంశాలు సగటు తండ్రికి, విద్యాభిమానికి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పదవ తరగతి పరీక్షల గురించి విద్యార్థులను, తల్లిదండ్రులను గందరగోళంలో పడవేస్తున్నారు. ఎప్సెట్ (గతంలో ఎంసెట్) రద్దు కార్పొరేట్ కళాశాలలకు మరింత ఊతం ఇచ్చే చర్యగా భావించవచ్చు. 2024- 25 లో 2245 ప్రభుత్వ పాఠశాలలు అడ్మిషన్లు లేక సహజ మరణం చెందాయి. కొన్నింటిని విలీన ప్రక్రియ ద్వారా కారుణ్య మరణానికి ప్రభుత్వం అనుమతిస్తున్నది. ఇక తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలకు మరణ దండన విధించడానికి ప్రభుత్వం పూనుకోవడం శోచనీయం. అది విద్యా వ్యవస్థకు మరణ శాసనం కాకూడదని విద్యాభిమానులు కోరుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమం అవసరమే కానీ ఐదవ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో బోధించి ఆ తరువాత మాధ్యమాన్ని ఐచ్ఛికం చేయడం సబబు. ఇక ఆరుట్ల పాఠశాలను చూపి రాష్ట్రం మొత్తం ఇలాంటి పాఠశాలలే తయారవుతాయనడం ఎలాంటిదంటే సోషల్ వెల్ఫేర్ సొసైటి వారు గౌలిదొడ్డి పాఠశాలను, గిరిజన సొసైటి వారు రాజేంద్రనగర్ కళాశాలను చూపి ప్రచారం చేసుకున్నట్లు ఉంది. మండలంలో క్లస్టర్లుగా చేసి పాఠశాలల విలీనం ద్వారా విద్యా వ్యవస్థ బలోపేతం జరగదు. అది విధ్వంసానికి దారితీసి భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థలు మరింత బలోపేతం అవ్వడానికి తోడ్పడుతుంది. పాఠశాలల విలీనం విద్యాభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది..?? విలీనం హేతుబద్ధమై ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. విద్యార్థులు లేని పాఠశాలలు, తక్కువ ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయడం ఎవరైనా ఆహ్వానిస్తారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పడవేస్తారా లేక గందరగోళం చేయనున్నారా..?? ప్రభుత్వ విద్య పతనం అంచున ఉన్నట్టుగా భావించవలసి వస్తుంది. కార్పొరేటుకు కూడా రెడ్ కార్పెట్ పరుస్తున్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ కదా ఆలోచించండి.


0 Comments